ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మహర్దశ
ABN , Publish Date - Aug 31 , 2025 | 10:46 PM
చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. కూటమి ప్రభుత్వం పీఎం ఉష (ప్రధానమంత్రి ఉచ్చతార్ శిక్షా అభియాన్) పథకం ద్వారా కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, సెమినార్ హాల్, జిమ్‌లను సమకూరుస్తున్నది.
పీఎం ఉష పథకంతో ప్రత్యేక సదుపాయాలు
అదనపు తరగతి గదులు, సైన్స్,
కంప్యూటర్ ల్యాబ్‌లు, జిమ్ ఏర్పాటు
రెండు నెలల్లో అందుబాటులోకి సేవలు
చింతపల్లి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందుబాటులోకి రానున్నది. కూటమి ప్రభుత్వం పీఎం ఉష (ప్రధానమంత్రి ఉచ్చతార్ శిక్షా అభియాన్) పథకం ద్వారా కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు, సెమినార్ హాల్, జిమ్‌లను సమకూరుస్తున్నది.
చింతపల్లిలో డిగ్రీ కళాశాలను 2008లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2010లో 11 గదులతో కళాశాల భవనాన్ని నిర్మించింది. ఈ గదులు విద్యాబోధనకు, కార్యాలయం, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్ కోసం వినియోగిస్తున్నారు. కళాశాలలో బీఎస్సీ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, జువాలజీ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఏ ఎకనామిక్స్, హిస్టరీ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల్లో 1200 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. కళాశాల ప్రారంభం నుంచి సైన్స్ ల్యాబ్‌లు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఉన్న తరగతి గదులు విద్యాబోధనకు సరిపడడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వం పీఎం ఉష పథకం కింద రూ.5 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఇందులో రూ.3.5 కోట్లతో జీప్లస్-1లో తరగతి గదులను నిర్మిస్తున్నది. మరో రూ.50 లక్షలతో పాత భవనం ఆఽధునికీకరణ, రూ.50 లక్షలతో ఫర్నిచర్, రూ.50 లక్షలతో సాఫ్ట్ కాంపోనెంట్స్‌కు కేటాయించింది.
విద్యార్థులకు కంప్యూటర్ విద్య
కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్ కోర్సుల విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం కంప్యూటర్ విద్యాబోధన జరుగుతున్నది. కంప్యూటర్ విద్యాబోధనకు అధ్యాపకులు ఉన్నప్పటికీ ప్రత్యేక ల్యాబ్ అందుబాటులో లేదు. దీంతో ప్రభుత్వం ల్యాబ్ నిమిత్తం 30 కంప్యూటర్లను సమకూర్చింది. దీంతో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ల్యాబ్ అందుబాటులోకి వచ్చిన తరువాత అన్ని కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు రోజూ గంటసేపు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నారు.
ప్రత్యేక సైన్స్ ల్యాబ్‌లు
కళాశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సైన్స్ విద్యార్థులకు ల్యాబ్‌లు అందుబాటులో లేవు. కూటమి ప్రభుత్వం ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ ల్యాబ్‌లను మంజూరు చేసింది. ల్యాబ్‌లలో విద్యార్థులు ప్రయోగాలు చేసేందుకు అవసరమైన అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చనున్నది. ఈ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహణకు అనువుగా ఉంటుంది.
సిక్స్ స్టాండింగ్ మల్టీ జిమ్
కళాశాల విద్యార్థుల కోసం అత్యాధునిక సిక్స్ స్టాండింగ్ మల్టీ జిమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ ఆధునిక జిమ్ అందుబాటులోకి వస్తే క్రీడాకారులు శరీర దారుఢ్యానికి ప్రైవేటు జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలాగే సెమినార్ హాల్‌ను కూడా కళాశాలలో ఏర్పాటు చేస్తున్నారు. 150 నుంచి 200 మంది కూర్చోవడానికి అనువుగా ఈ హాల్ నిర్మాణం జరుగుతుంది.