డైట్‌కు మహర్దశ
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:11 AM
ఉమ్మడి ఏపీలో తొలి తరం జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్)లలో ఒకటైన భీమిలి డైట్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నారు.
జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయం
‘డైట్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’గా అభివృద్ధి
భీమిలి సెంటర్‌కు రూ.13.65 కోట్లు మంజూరు
తరగతి గదులు, పాలనా భవనం, హాస్టల్ భవనాలు కొత్తవి నిర్మాణం
పూర్తిస్థాయిలో సదుపాయల కల్పన
రెండేళ్లలో పూర్తికి నిర్ణయం
విశాఖపట్నం/భీమిలి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి ఏపీలో తొలి తరం జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్)లలో ఒకటైన భీమిలి డైట్‌ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నారు. తరగతి గదులు, హాస్టల్ భవనాలు, పాలనా భవనం కొత్తవి నిర్మించనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.13.65 కోట్లు మంజూరుచేసింది.
రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను బలోపేతం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, దశల వారీగా వాటిని అభివృద్ధి చేస్తోంది. డైట్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా పూర్తిస్థాయిలో ఆధునికీకరించాలనే యోచనతో తొలిదశలో మూడింటికి నిధులు ఇచ్చింది. మలి దశలో గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో డైట్స్‌కు నిధులు ఇచ్చింది. సుమారు 11 ఎకరాల్లో ఉన్న భీమిలి డైట్‌లో చాలావరకు భవనాలు శిథిలావస్థకు చేరాయి. దాంతో కొన్ని భవనాలను వినియోగించకుండా తాళాలు వేశారు. ఉన్న భవనాలు సరిపోకపోవడంతో నిర్వహణకు కొంతవరకు ఇబ్బంది ఏర్పడుతున్నది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనాలను పూర్తిగా తొలగించనున్నారు. హాస్టల్స్ ఉన్నచోట కొంత వరకు డైట్ భూమి ఆక్రమణలకు గురైంది. ఆక్రమణలు తొలగించి ప్రహరీ నిర్మించాల్సి అవసరం ఉందని ఇంజనీరింగ్ విభాగం అంచనా వేసింది.
మూడు తరగతి గదులతో అడకమిక్ బ్లాక్, ఎనిమిది గదులతో పాలనా బ్లాక్, ఆడిటోరియం, నాలుగు గదులతో లేబొరేటరీ, కంప్యూటర్ గది, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, స్పెషల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ల నిర్మాణానికి రూ.4.8 కోట్లు కేటాయించారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాల నిర్మాణానికి రూ.3.6 కోట్లు, మరుగుదొడ్లకు రూ.45 లక్షలు కేటాయించారు. ఇంకా ఆడియో విజువల్ ఎయిడ్స్, డిజిటల్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్, ఇంటర్‌నెట్ సౌకర్యం, ప్రత్యేకించి వెబ్‌సైట్ రూపకల్పన, స్మార్ట్ తరగతుల నిర్మాణానికి రూ.1.16 కోట్లు, ప్రహరీ గోడ, సెక్యూరిటీ పోస్టు నిర్మాణం, సీసీ టీవీ, ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్ ఏర్పాటుకు రూ.0.91 కోట్లు, డైట్ అధ్యాపకుల కోసం క్వార్టర్ల నిర్మాణాలకు రూ.1.03 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే తాగునీటి సదుపాయం, క్యాంటీన్ భవనం, గార్డెనింగ్, ఫర్నీచర్, వాహనాల పార్కింగ్, సోలార్ ఎక్విప్‌మెంట్, క్రీడలకు సంబంధించి పరికరాలు, నిర్వహణ తదితర అంశాలకు రూ.1.67 కోట్లు కేటాయించారు. నూతన భవనాల నిర్మాణం, ఇతరత్రా వసతుల కల్పనకు టెండర్లు ఆహ్వానించారు. రెండు సంవత్సరాల్లో భవనాలు నిర్మించి వసతులు కల్పించాలని సమగ్ర శిక్షా ఉన్నతాధికారులు నిర్ణయించారు.