చోడవరం సీహెచ్‌సీకి మహర్దశ
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:56 AM
స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) దశ మారనున్నది. ఇప్పటి వరకు 30 పడకలకే పరిమితమైన ఈ వైద్యశాల.. త్వరలో వంద పడకల స్థాయికి పెరగనుంది. ఈ మేరకు వసతులు, సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చోడవరంతోపాటు రాష్ట్రంలో మొత్తం తొమ్మిది సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పడకల పెంపు, వసతుల కల్పనకు రూ.51.75 కోట్లు కేటాయించింది.
30 పడకల నుంచి 100 పడకలకు పెంచిన ప్రభుత్వం
చోడవరం సహా తొమ్మిది ఆస్పత్రులకు రూ.51.75 కోట్లు కేటాయింపు
పెరగనున్న వైద్య నిపుణులు, సిబ్బంది
రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు
చోడవరం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) దశ మారనున్నది. ఇప్పటి వరకు 30 పడకలకే పరిమితమైన ఈ వైద్యశాల.. త్వరలో వంద పడకల స్థాయికి పెరగనుంది. ఈ మేరకు వసతులు, సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చోడవరంతోపాటు రాష్ట్రంలో మొత్తం తొమ్మిది సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పడకల పెంపు, వసతుల కల్పనకు రూ.51.75 కోట్లు కేటాయించింది.
చోడవరం నియోజకవర్గంతోపాటు మాడుగుల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న చోడవరం సీహెచ్‌సీ.. రిఫరల్ ఆస్పత్రిగానే ఉండిపోయింది. నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తున్నప్పటికీ సౌకర్యాలు అంతంతమాత్రంగానే వున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు సౌకర్యాలు లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులను అనకాపల్లి లేదా విశాఖపట్నం రిఫర్ చేస్తున్నారు. అయితే కొంతమంది అంత దూరం వెళ్లలేక పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో (2014-19) వున్నప్పుడు రూ.2.5 కోట్లు మంజూరు చేయడంతో నూతన భవనాలు నిర్మించి రిసెప్షన్ కౌంటర్, డాక్టర్లకు ప్రత్యేకంగా గదులు, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా వార్డులు, పిల్లల వార్డు, ప్రసూతి వార్డు నిర్మించారు. ఎక్స్‌రే యూనిట్, ఈసీజీ, స్కానింగ్ అందుబాటులోకి వచ్చాయి. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఐదేళ్లపాటు ఆస్పత్రిని పట్టించుకోలేదు. దీంతో ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్ సేవలు పూర్తిస్థాయిలో రోగులకు అందుబాటులోకి రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే రూ.38 లక్షలతో పోస్టుమార్టం కేంద్రం నిర్మించారు. తాజాగా సీహెచ్‌సీని 30 పడకల నుంచి వంద పడకలకు అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
మరింత మంది వైద్య నిపుణులు, సిబ్బంది
సిరికి దినేశ్‌కుమార్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్
ఆస్పత్రిలో పడకల సంఖ్య పెరిగితే ఆ మేరకు అదనంగా వైద్యులు, సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుతం ఇక్క పీడియాట్రిక్స్, గైనిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆస్పత్రి స్థాయి పెరిగితే ఈఎన్‌టీ, ఆర్థో, ఆఫ్తాలమిక్ తదితర నిపుణులను ప్రభుత్వం నియమిస్తుంది. ఎక్స్‌రే యూనిట్‌ను నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తాం.