ఆశ్రమ పాఠశాలలకు మహర్దశ
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:24 PM
మండలంలోని మూడు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలతో పాటు కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల-1కు మహర్దశ పట్టింది.
నాలుగు స్కూళ్లకు అదనపు భవన నిర్మాణాలకు రూ.11 కోట్లు మంజూరు
కొయ్యూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మూడు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలతో పాటు కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల-1కు మహర్దశ పట్టింది. ఈ పాఠశాలలకు అదనపు వసతి సౌకర్యాలు కల్పించేందుకు పీఎం జన్‌మన్ పథకం కింద రూ. 6.3 కోట్లు, జన్ జాతీయ గౌరవ్ ఉత్కర్ష్ అభియాన్(డీఏ-జేజీయూఏ) కింద రూ.4.7 కోట్లు మంజూరు కావడంతో పనులు చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
మండలంలోని రావణాపల్లి, కొమ్మిక, రాజేంద్రపాలెం బాలికల ఆశ్రమ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి పీఎం జన్‌మన్ పథకం కింద ఒక్కొక్క పాఠశాలకు రూ.2.1 కోట్లు చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఒక్కొక్క పాఠశాలకు 14 తరగతి గదులతో కూడిన భవన నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయా పాఠశాలల్లో సంబంధిత ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది స్థల పరిశీలన చేసి చదును చేసే పనులు చేపట్టారు. కాగా కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల-1ను ఏర్పాటు చేసి మూడు దశాబ్దాలు అవుతున్నా ఇక్కడ అదనపు తరగతి గదులు నిర్మించలేదు. ప్రస్తుతం ఉన్న భవనం కూడా శిథిలావస్థకు చేరింది. దీంతో ఈ పాఠశాలకు నూతన భవనం మంజూరు చేయాలని ప్రస్తుత ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్ మూడు నెలల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం జన్ జాతీయ గౌరవ్ ఉత్కర్ష్ అభియాన్ పథకం కింద ఈ పాఠశాలకు వసతి గృహం, 14 తరగతి గదులతో పాటు ఆరు సిబ్బంది వసతి గృహాల నిర్మాణానికి రూ.4.7 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ, ఏటీడబ్ల్యూవో ఆధ్వర్యంలో భవన నిర్మాణాలకు వీలుగా మార్కింగ్ చేశారు. ఈ సందర్భంగా ఏటీడబ్ల్యూవో మాట్లాడుతూ మొదటి విడతగా ఈ నాలుగు ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయన్నారు. దశల వారీగా మిగిలిన 13 ఆశ్రమ పాఠశాలల అభివృద్ధికి ఇదే తరహాలో నిధులు కేటాయించేలా ప్రతిపాదనలు పంపామని, త్వరలో అవి మంజూరవుతాయని ఆయన చెప్పారు.