Share News

మహా యోగం

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:15 AM

యోగాంధ్రాకు సర్వం సిద్ధమైంది. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన భారతదేశం అందులోనే సరికొత్త రికార్డు నెలకొల్పడానికి విశాఖ వేదిక కాబోతోంది.

మహా యోగం

  • యోగాంధ్రాకు సర్వం సిద్ధం

  • ఐదు లక్షల మందితో గిన్నిస్‌ రికార్డుకు యత్నం

  • విశాఖ నుంచి భీమిలి వరకూ బీచ్‌రోడ్డులో ఏర్పాట్లు

  • నగరంలోని విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు, పార్కుల్లో కూడా...

  • నగరానికి చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కె.పవన్‌కల్యాణ్‌

  • జనం తరలింపునకు శుక్రవారం సాయంత్రానికే నిర్దేశిత ప్రాంతాలకు చేరుకున్న బస్సులు

  • ట్రాఫిక్‌ నియంత్రణే పెను సవాల్‌

విశాఖపట్నం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి):

యోగాంధ్రాకు సర్వం సిద్ధమైంది. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన భారతదేశం అందులోనే సరికొత్త రికార్డు నెలకొల్పడానికి విశాఖ వేదిక కాబోతోంది. ఐదు లక్షల మందితో యోగాసనాలు వేయించి గిన్నిస్‌ రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ కార్యక్రమం ఏర్పాటుచేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజునే దీనిని నిర్వహిస్తుండడం విశేసం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ప్రధాని కంటే ముందే విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, తదితరులు విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.

విశాఖ నుంచి భీమిలి వరకూ

నగరంలోని ఆర్‌కే బీచ్‌రోడ్డులో గల కాళీమాత ఆలయం వద్ద నుంచి భీమిలి వరకూ 29.8 కి.మీ. పొడవున యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ బీచ్‌ కారిడార్‌లో 3.5 లక్షల మంది, జిల్లాలో వివిధ ప్రాంతాలు, స్టేడియాల్లో మరో 1.5 లక్షల మందితో ఆసనాలు వేయించడానికి ఏర్పాట్లు జరిగాయి. దాదాపు పది వేల వాహనాలను జనాలను తరలించడానికి కేటాయించారు. ఈ బస్సులు, మాక్సీ క్యాబ్‌లు, ఆటోలు అన్నీ శుక్రవారం సాయంత్రానికే నిర్దేశించిన ప్రాంతాలకు చేరిపోయాయి. ఉదయం నాలుగు గంటల నుంచే అవి నిర్దేశిత ప్రాంతాలకు సూచించిన మార్గంలో వెళ్లేలా పోలీసు అధికారులు మార్గదర్శనం చేశారు. దారిపొడవునా 75 పార్కింగ్‌ కేంద్రాలు పెట్టి, అక్కడ బస్సులు ఆపిన తరువాత వాటిలో దిగిన వారిని కేటాయించిన కంపార్ట్‌మెంట్లకు తీసుకువెళ్లే బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించారు. రిజిస్ట్రేషన్‌ కోసం ఎటువంటి ఐడీ కార్డులు అవసరం లేదు.

వెళ్లేమార్గం..వచ్చే మార్గం

బీచ్‌ రోడ్డులో 326 కంపార్ట్‌మెంట్లు పెట్టారు. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు 40 మంది సిబ్బందిని కేటాయించారు. కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేటప్పుడే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. కార్యక్రమం ముగిసిన తరువాత అదే కంపార్టుమెంట్‌ నుంచి బయటకు రావడానికి మరో మార్గం ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఇబ్బందులు వస్తే చికిత్స కోసం అంబులెన్స్‌లతో ప్రతి 5 కి.మీ. ఒకటి చొప్పున 5 పడకల ఆస్పత్రులు పెట్టారు. అత్యుత్సాహంతో ఎవరైనా సముద్రంలో ఈతకు దిగితే వారిని రక్షించడానికి గజ ఈతగాళ్లను తీసుకువచ్చారు. తీరప్రాంతం కావడంతో పాములు, క్రిములు, కీటకాలు ఉంటాయని స్నేక్‌ క్యాచర్లను పెట్టారు. దాదాపుగా మూడు గంటలు అంతా అక్కడ కూర్చొంటారు కాబట్టి కీటకాలు రాకుండా అవసరమైన ప్రాంతాల్లో అటవీ శాఖతో పురుగుల మందు మూడుసార్లు పిచికారీ చేయించారు. కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమై 8 గంటలకు ముగుస్తుంది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒక టీ షర్టు, యోగా మ్యాట్‌, అల్పాహారంతో కూడిన ప్యాకెట్‌ ఇస్తారు.

ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి

కార్యక్రమానికి వచ్చే వారి కోసం పది వేల వాహనాలు ఏర్పాటుచేశారు. ఇవి కాకుండా నాయకులు, అధికారుల వాహనాలు కూడా ఉంటాయి. కార్యక్రమం ముగిసిన తరువాత ఒకేసారి అంతా బయటకు వస్తారు. అన్ని బస్సులు రోడ్లపైకి వస్తే ట్రాఫిక్‌ జామ్‌ అయిపోతుంది. ట్రాఫిక్‌ సమస్య లేకుండా అంతా సక్రమంగా తిరిగి ఇళ్లకు చేరేలా పోలీస్‌ అధికారులు ప్లానింగ్‌ చేసుకున్నారు. సీసీ టీవీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెంటనే తగిన ఆదేశాలు జారీ చేసి ట్రాఫిక్‌ క్లియర్‌ అయ్యేలా చేస్తామని చెబుతున్నారు.

యోగాంధ్రాలో 11 వేల నేవీ కుటుంబాలు

తీరంలో ఐదు యుద్ధనౌకలపై యోగాసనాలు

విన్యాసాల్లో హాక్‌లు, డార్నియర్లు

విశాఖపట్నం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి):

విశాఖ సాగర తీరాన నిర్వహిస్తున్న యోగాంధ్రాలో తూర్పు నౌకాదళం నుంచి 11 వేల మంది సెయిలర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. వీరి కోసం ప్రధాన వేదిక వద్ద పది కంపార్ట్‌మెంట్లు కేటాయించారు. ఫ్రంట్‌ లైన్‌ యుద్ధనౌకలుగా పేరొందిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ చెన్నై, ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం, ఐఎన్‌ఎస్‌ మైసూర్‌, ఐఎన్‌ఎస్‌ రాజపూత్‌లను తీరానికి దగ్గరగా లంగరు వేసి వాటిపై కూడా యోగాసనాలు వేయనున్నారు. యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభానికి ముందు నిర్వహించే యుద్ధ విమానాల ఫ్లై పాస్ట్‌లో డార్నియర్లు, హాక్‌లు, చేతక్‌ హెలికాప్టర్లు పాల్గొంటాయి. వీటితో శుక్రవారం సాయంత్రమే రిహార్సల్‌ నిర్వహించారు. ‘ఒక భూమి, ఒక ఆరోగ్యం కోసం యోగా’ నినాదంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా పాల్గొంటున్నామని నేవీ వర్గాలు పేర్కొన్నాయి.

ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్‌ విజయానంద్‌

విశాఖపట్నం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): బీచ్‌రోడ్డు పొడవునా శనివారం ఉదయం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఆదేశించారు. బీచ్‌రోడ్డులో ప్రధాన వేదిక, కంపార్టుమెంట్లు, ఎల్‌ఈడీ స్ర్కీన్లు, సౌండ్‌ సిస్టమ్‌ను శుక్రవారం ఆయన పరిశీలించి పలు సూచనలిచ్చారు. ప్రధాన వేదిక ఇన్‌చార్జి, వీఎంఆర్‌డీఎ కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌ ఏర్పాట్లను వివరించారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పనిచేయాలని సీఎస్‌ సూచించారు. యోగా దినోత్సవానికి వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట సీనియర్‌ అధికారి వీరపాండ్యన్‌ తదితరులున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 01:15 AM