Share News

క్రీడా విభాగంపై ‘మహా’ నిర్లక్ష్యం

ABN , Publish Date - Dec 02 , 2025 | 01:10 AM

మహా విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ)లో అత్యంతకీలక క్రీడా విభాగంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి.

క్రీడా విభాగంపై ‘మహా’ నిర్లక్ష్యం

ఏడాదిన్నరగా స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ పోస్టు ఖాళీ

ఇన్‌చార్జిగా వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి ఉద్యోగికి బాధ్యతలు

జీవీఎంసీ ఆధీనంలో విలువైన స్టేడియం, మైదానాలు

మరమ్మతుల పేరుతో ఏళ్లుగా సాగుతున్న పనులు

నిలిచిపోయిన సమ్మర్‌క్యాంప్‌లు, క్రీడాశిక్షణ శిబిరాలు

పిల్లల్లో క్రీడల పట్ల కొరవడుతున్న ఆసక్తి

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ)లో అత్యంతకీలక క్రీడా విభాగంపై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. గతంలో నిత్యం క్రీడాపోటీలు, పిల్లలకు శిక్షణ శిబిరాలు, డిపార్టుమెంట్‌ గేమ్స్‌, కార్పొరేటర్లకు క్రీడాపోటీల తో నిత్యం సందడిగా ఉండే క్రీడా విభాగం ఇప్పుడు స్తబ్ధుగా మారిపోయింది. ఆ విభాగాన్ని కమిషనర్‌ ఆదేశాల మేరకు నడిపించే డైరెక్టర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ పోస్టు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ స్థాయి ఉద్యోగికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో నగరంలో క్రీడాభివృద్ధికి, పిల్లల్లో క్రీడలపట్ల ఆసక్తి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నగరంలో పిల్లలకు క్రీడలపట్ల ఆసక్తిపెంచడంతో పాటు క్రీడల్లో నైపుణ్యం కలిగినవారికి మరింత ఉన్నత మైన శిక్షణ ఇచ్చి ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ ప్రత్యేకంగా క్రీడావిభాగాన్ని ఏర్పాటుచేసింది. నగరంలోని కీలకప్రాంతాల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టి స్టేడియంలు, ఇండోర్‌ స్టేడియంలు, మైదానాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను నిర్మించింది. ఆయా చోట్ల నగరవాసులు, యువత, వర్దమాన క్రీడాకారులు సాధన చేయడం, శిక్ష ణ పొందడంతోపాటు వ్యాయామం చేసుకునే సదుపా యాలను కల్పించింది. కొన్నిచోట్ల నామమాత్రపు రుసుముతో, మిగిలిన చోట ఉచితంగానే ప్రవేశం కల్పిస్తున్నారు. క్రీడలపట్ల ఆసక్తి కలిగిన చిన్నారులను ప్రైవేటు అకాడమీలు, కోచింగ్‌సెంటర్లలో చేర్చితే భారీగా ఫీజులు చెల్లించాలి. ఇది సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు భారం. అలాంటివారికి జీవీఎంసీ పరిధిలోని స్టేడియంలు, మైదానాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ల్లో నామమాత్రపు ఫీజుతో నిపుణులైన కోచ్‌లు శిక్షణ ఇచ్చేవారు. అయితే జీవీఎంసీకి ప్రత్యక్షంగా కోచ్‌లు లేకపోవడంతో కరాటే, బాక్సింగ్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, స్విమ్మింగ్‌, కబడ్డీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించడం, తరచూ క్రీడాపోటీలు నిర్వహించడం ద్వారా క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేవారు. ఫలితంగా మిగిలిన చిన్నారుల్లో క్రీడలపట్ల ఆసక్తి పెరిగేది.

జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏటా వేసవిలో సమ్మర్‌స్పోర్ట్స్‌ పేరుతో అనేక క్రీడాంశాల్లో తర్ఫీదు ఇవ్వడం, స్నాక్స్‌, పౌష్టికాహారం అందించడం, క్రీడాపరికరాలు, సామగ్రిని సమకూర్చేవారు. జీవీఎంసీ ఉద్యోగుల్లో స్నేహభావంతో పాటు పనిఒత్తిడి నుంచి ఉపశమనం లభించేలా ఏటా క్రీడాపోటీలు నిర్వహిస్తుంటారు. కార్పొరేటర్లకు కూడా ఈ పోటీలు జరిగేవి. ఈ నేపథ్యంలో జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని స్పోర్ట్‌డైరెక్టర్‌గా నియమించి నగరంలో క్రీడాభివృద్ధికి జీవీఎంసీ కృషిచేసింది.

అయితే స్పోర్ట్స్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వై.శ్రీనివాసరావు ను ప్రభుత్వం ఏడాదిన్నర కిందట బదిలీచేసింది. ఆ స్థానంలో ఎవరినీ నియమించకుండా, వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ స్థాయి ఉద్యోగికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. అతని ప్రతిపాదనలు, సూచనలను ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, చిరుద్యోగి కావడంతో క్రీడావిభాగంలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లే సాహసం చేయలేకపోవడంతో క్రీడారంగం కుదేలయింది. గత ఏడాది వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించలేదు. ఉద్యోగులకు, కార్పొరేటర్లకు ఆటలపోటీలు జరగలేదు. ఏడాదిన్నరలో జీవీఎంసీ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.

12 చోట్ల క్రీడా ప్రాంగణాలు

జీవీఎంసీకి 12 చోట్ల క్రీడా ప్రాంగణాలున్నాయి. భీమిలి మునిసిపల్‌ ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియంలు ఉన్నాయి. జోన్‌-3 పరిధిలో రేసపువానిపాలెం వద్ద స్వర్ణభారతి ఇండోర్‌స్టేడియం, పెదవాల్తేరు రైతుబజార్‌ వెనుక లాన్‌టెన్నిస్‌ స్పోర్ట్స్‌కాంప్లెక్స్‌, ఎంవీపీ కాలనీ సెక్టార్‌-4లో రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియం, వన్‌టౌన్‌లో ఇందిరాప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియం, గాజువాక వికాస్‌నగర్‌లో రాజీవ్‌ ఇండోర్‌ క్రీడా ప్రాంగణం, శ్రీహరిపురం కోరమండల్‌గేట్‌ ఎదురుగా అవుట్‌డోర్‌ క్రీడాప్రాంగణం, అనకాపల్లిలో ఎన్టీఆర్‌ అవుట్‌డోర్‌ స్టేడియం, రాజీవ్‌గాంధీ ఇండోర్‌స్టేడియం , ఆర్కేబీచ్‌ వద్ద జీవీఎంసీ ఆక్వాస్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, ఎంవీపీకాలనీలో స్మార్ట్‌సిటీకింద నిర్మించిన స్పోర్ట్స్‌ ఎరీనా ఉన్నాయి. వీటి నిర్వహణకు ఉద్యోగులు, వసతులు ఉన్నప్పటికీ జీవీఎంసీ అధికారులపై స్వార్థ్యం, వారిపై వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి కీలకమైన ఎంవీపీకాలనీలోని స్పోర్ట్స్‌ ఎరీనా, బీచ్‌రోడ్డులోని ఆక్వాస్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ప్రైవేటుకు అప్పగించేయడంతో సామాన్యులు శిక్షణ పొందలేని పరిస్థితి ఏర్పడింది. స్వర్ణభారతి ఇండోర్‌స్టేడియం, అనకాపల్లి ఎన్టీఆర్‌ స్టేడియం, గాజువాక వికాస్‌నగర్‌లోని రాజీవ్‌ ఇండోర్‌ క్రీడాప్రాంగణం, భీమిలిలోని మునిసిపల్‌ ఇండోర్‌స్టేడియం ఏళ్లుగా ఆధునికీకరణ పేరుతో మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ స్వర్ణభారతి పనులను పరిశీలించి ఆగ్రహం వ్యక్తంచేశారు. 20 రోజుల్లో పూర్తిచేయాల్సిందేనని స్పష్టంచేశారు.

Updated Date - Dec 02 , 2025 | 01:10 AM