గిరిజన గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్స్
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:09 PM
పారిశుధ్యం మెరుగుపర్చడంతో పాటు దోమలు, అంటువ్యాధులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆరు క్లస్టర్లలో ఒక్కొక్క మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం చేపట్టింది. ఉపాధి హామీ పథకం నిధులతో మ్యాజ్ డ్రైన్లు నిర్మాణం చేపడుతోంది. భవిష్యత్తులో ప్రతి గిరిజన గ్రామంలోనూ మ్యాజిక్ డ్రైన్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.
జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆరు నిర్మాణం
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు కేటాయింపు
మెరుగుపడనున్న పారిశుధ్య సమస్య
పెరగనున్న భూగర్భ జలాలు
మురుగు, దుర్వాసన బెడద ఉండదు..
చింతపల్లి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు గృహాల్లో వినియోగించిన మురుగు నీరు బయటకు పంపించేందుకు డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ డ్రైన్లలో కలుషితమైన నీరు ప్రవహిస్తూ, చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఈ మురుగు నీరు వాగులు, చెరువుల్లో కలిసి మంచి నీరు కలుషితమవుతున్నది. అలాగే మురుగు కాలువల వద్ద ఈగలు, దోమలు విలయతాండవం చేస్తుంటాయి. దీంతో ప్రతి ఏడాది వర్షాకాలం ప్రజలు అంటురోగాల బారిన పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మ్యాజిక్ డ్రైన్లు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ జిల్లా సోమవరం గ్రామంలో ప్రయోగాత్మకంగా నిర్మించిన మ్యాజిక్ డ్రైన్ విజయవంతంగా కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం ఇలా..
మ్యాజిక్ డ్రైన్ ఇంకుడు గుంతను పోలి ఉంటుంది. ప్రధానంగా 0.55మీటర్లు వెడల్పు కలిగిన 0.40 మీటర్ల లోతు గల కాలువను తీస్తారు. ఈ కాలువలో తొలుత 225 మిల్లీమీటర్ల రాళ్లు అడుగు భాగంలో మొదటి లేయర్‌గా వేస్తారు. 70-100 మిల్లీమీటర్ల చిప్స్ రెండో లేయర్‌గానూ, 40 మిల్లీమీటర్ల చిప్స్ మూడో లేయర్‌గా, 20 మిల్లీమీటర్ల చిప్స్ నాలుగో లేయర్‌గా వేస్తారు. అలాగే ప్రతి 50మీటర్ల దూరానికి ఒక 120 సెంటీమీటర్ల ఇంకుడు గుంతను నిర్మిస్తారు. గృహాల నుంచి వచ్చే వ్యర్థపు నీరు నేరుగా ఈ మ్యాజిక్ డ్రైన్ వద్దకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తారు. వ్యర్థపు నీరు మ్యాజిక్ డ్రైన్‌పై పడగానే ఇంకిపోతుంది. ఒకవేళ నీరు అధిక మొత్తంలో ఈ డ్రైన్‌పై ప్రవహిస్తే 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలో ఇంకిపోతుంది. ఈ మ్యాజిక్ డ్రైన్ వల్ల మురుగు నీరు ఎక్కడా నిలువ ఉండదు.
మురుగు, దుర్వాసన నియంత్రణ
ఈ మ్యాజిక్ డ్రైన్ వ్యవస్థ మురుగు, దుర్వాసన, దోమల వృద్ధిని నియంత్రించడానికి సహాయపడుతుంది. గృహాల నుంచి వచ్చే వ్యర్థ నీరు మ్యాజిక్ డ్రైన్‌లోకి రాగానే ఎక్కడికక్కడ ఇంకిపోతుంది. ఈ వ్యవస్థ వల్ల భుగర్భజలాలు పెరుగుతాయి. గ్రామంలో ఉన్న వాగులు, చెరువులు కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉంటాయి. వీధుల్లో దుర్గంధ సమస్య ఉండదు.
తగ్గనున్న నిర్మాణ ఖర్చు
సాధారణంగా సిమెంట్ డ్రైన్లు నిర్మాణానికి ఖర్చు అధికంగా అవుతుంది. వంద మీటర్ల సిమెంట్ డ్రైన్ నిర్మాణానికి రూ.4 నుంచి రూ.5లక్షలు ఖర్చు చేయాలి. 100 మీటర్ల మ్యాజిక్ డ్రైన్ నిర్మాణానికి కేవలం రూ.64.5వేలు ఖర్చు అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అలాగే సిమెంట్ డ్రైన్లు నిర్వహణ పంచాయతీ సిబ్బందికి భారంగా మారింది. మ్యాజిక్ డ్రైన్ నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది.
అంతర్లలో ప్రయోగాత్మకంగా నిర్మాణం
లాలం సీతయ్య, ఏపీడీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్, చింతపల్లి
జిల్లాలో అరకులోయ, పాడేరు, చింతపల్లి, అడ్డతీగల, రంపచోడవరం, చింతూరు క్లస్టర్లలో ఒక్కొక్క మ్యాజిక్ డ్రైన్‌ను ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్నారు. చింతపల్లి క్లస్టర్ పరిధిలోని అంతర్ల గ్రామంలో 200 మీటర్ల మ్యాజిక్ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించాం. వంద మీటర్లకు రూ.64,534, 200 మీటర్లకు రూ.1,29,068 నిధులను ఉపాధి హామీ పథకం నుంచి కేటాయించారు. భవిష్యత్తులో ప్రతి గ్రామంలోనూ మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తాం.