ఘనంగా మాడుగుల మోదకొండమ్మ జాతర
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:24 PM
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి జాతర మంగళవారం వైభవంగా జరిగింది. వేకువజాము ఐదు గంటల నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోటెత్తిన భక్తులు
మాడుగుల, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి జాతర మంగళవారం వైభవంగా జరిగింది. వేకువజాము ఐదు గంటల నుంచి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఘటాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటలు దాటిన తరువాత సతకంపట్టు వద్ద కొలువుతీరిన అమ్మవారి పాదాలు, ఘటాలను గ్రామంలో ఊరేగింపుగా తిప్పి, తిరిగి ఆలయానికి తీసుకు వచ్చారు. ఊరేగింపు సందర్భంగా నేల వేషాలు, బల్ల వేషాలు ఏర్పాటు వేశారు. భారీగా మందుగుండు సామగ్రి పేల్చారు. బస్టాండ్, దుర్గాలమ్మ ఆలయం, సతకంపట్టు వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ జి.నారాయణరావు పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జాతరను పురస్కరించుకొని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి దంపతులు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, కార్పొరేషన్ డైరెక్టర్లు పీలా గోవింద్ సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, పీవీజీ కమార్, అలాగే సత్యవతి, పీవీఎన్ మాధవ్, కోట్ని బాలాజీ, బండారు అప్పలనాయుడు, ఆడారి ఆనందబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారిని ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించి అమ్మవారి దర్శనం అనంతరం శాలువాతో సత్కరించి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు.