పిచ్చికుక్క స్వైరవిహారం
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:06 AM
మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి, గురువారం ఉదయం ఒక పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనిపించిన వారందరిపైనా దాడి చేసి కరిచింది. దీంతో జనం బెంబేలెత్తిపోయారు. రెండేళ్ల చిన్నారి నుంచి 75 వృద్ధుడి వరకు మొత్తం 27 మందికి పిచ్చికుక్క కాట్లు వేసింది. వీరిలో సగం మంది బీసీ వసతి గృహం బాలికలే వున్నారు.
రావికమతంలో 27 మందికి గాయాలు
తొలుత అర్ధరాత్రి బీసీ బాలికల వసతిగృహంలో దాడి
12 మంది విద్యార్థినులకు కుక్కకాట్లు
ఉదయం రావికమతం వీధుల్లో మరికొంతమందిపై దాడి
నాగన్నపాలెంలో రెండేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు
ప్రథమ చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలింపు
పిచ్చికుక్క దాడిపై కలెక్టర్ ఆరా
రావికమతం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి, గురువారం ఉదయం ఒక పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనిపించిన వారందరిపైనా దాడి చేసి కరిచింది. దీంతో జనం బెంబేలెత్తిపోయారు. రెండేళ్ల చిన్నారి నుంచి 75 వృద్ధుడి వరకు మొత్తం 27 మందికి పిచ్చికుక్క కాట్లు వేసింది. వీరిలో సగం మంది బీసీ వసతి గృహం బాలికలే వున్నారు.
రావికమతం బీసీ బాలికల వసతి గృహంలోకి బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండున్నర గంటల సమయంలో పిచ్చికుక్క చొరబడింది. ఈ సమయంలో గాఢ నిద్రలో వున్న బాలికలపై దాడి చేసింది. దీంతో వారంతా పెద్దగా కేకలు వేసి, తలో దిక్కుకు పరుగులు తీశారు. అయినాసరే కుక్క వెంటపడి కాళ్లు, చేతులు, ముఖంపై కరించింది. వెలంకాయల పావని, కుడే సౌజన్య, కోన ప్రసన్న, చొప్పగండి పూజిత, పోతల మోక్షిత దుర్గ, వడ్డి నవ దుర్గ, సుంకర స్వప్న, మరిశా భావ్యశ్రీ, కె.స్వాతి, కిర్లంపల్లి దుర్గా భవానీ, పినబోయిన తనూజ, తేగాడ గీత కుక్కకాటుకు గురయ్యారు. పిచ్చికుక్క మళ్లీ గురువారం ఉదయం రావికమతంలో గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె దేముడు, కేశంశెట్టి నాగమణి, మేడివాడకు చెందిన మీసాల చరణ్, సంపతి అన్నపూర్ణ, కుముదానిపేటకు చెందిన కోల నవీన్ ప్రసాద్, రావికమతానికి చెందిన వెచ్చా విశ్వ, సంపతి రమణమ్మ, ఎండీ దావూద్ అలం, బండారు అచ్యుతరావు, గోకాడ శ్రీరామమూర్తి, మైచర్ల కృష్ణమ్మలపై దాడిచేసి గాయ పరిచింది. అక్కడి నుంచి రావికమతం పక్కనే ఉన్న నాగన్నపాలెం వెళ్లి ఒక ఇంట్లోకి చొరబడి రెండేళ్ల బాలుడు కడులూరి చైతన్య వర్దన్‌ను నోట కరుచుకుని బయటకు ఈడ్చుకొచ్చింది. చెవి, తలపైన కరిచి గాయపరిచింది. కుక్కకాటు బాధితులు స్థానిక పీహెచ్‌సీకి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన రెండేళ్ల బాలుడు చైతన్య వర్దన్‌ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పంపారు. ఎంపీడీవో మహేశ్, డిప్యూటీ ఎంపీడీవో సీతారామస్వామి, ఎంఈఓ-2 బ్రహ్మజీ ఆస్పత్రికి వెళ్లి పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. కాగా పిచ్చికుక్కను గురువారం మధ్యాహ్నం నాగన్నపాలెంలో గుర్తించి, కర్రలతో కొట్టి హతమార్చారు. కాగా పిచ్చికుక్క దాడిలో 27 మంది గాయపడిన విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయకృష్ణన్, రావికమతం పీహెచ్‌సీ వైద్యాధికారులకు వీడియో కాల్ చేసి ఆరా తీశారు