యుద్ధ వాతావరణాన్ని తలపించిన మాక్‌డ్రిల్
ABN , Publish Date - May 08 , 2025 | 12:57 AM
జిల్లా కేంద్రం పాడేరు ఆర్‌టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో బుధవారం నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది.
యుద్ధం సంభవిస్తే ప్రజలు, యంత్రాంగం అప్రమత్తతపై ఆకట్టుకున్న ప్రదర్శన
దేశానికి ప్రజలు అండగా నిలవాలి: కలెక్టర్ దినేశ్‌కుమార్
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి: ఎస్‌పీ అమిత్‌బర్ధార్
పాడేరు, మే 7(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరు ఆర్‌టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో బుధవారం నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. పహల్గాం ఘటన నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌తో ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశాలున్నాయనే అనుమానంతో బుధవారం దేశవాప్తంగా సివిల్ మాక్‌డ్రిల్‌ను నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. దీంతో జిల్లా యంత్రాంగం స్థానిక ఆర్‌టీసీ బస్‌కాంప్లెక్స్ ఆవరణలో మాక్‌డ్రిల్ నిర్వహించింది. శత్రు దేశం నుంచి బాంబుల దాడి జరిగితే చెవులు మూసుకుని పడుకోవడం, ఇళ్లపై చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు రక్షించడం, గాయాల పాలైన వారికి తక్షణ వైద్య సేవలు అందించడం, మరికొందర్ని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించడం వంటి చర్యలన్నీ నమూనాగా ప్రదర్శించారు. ఆయా దృశ్యాలను చూసిన వారికి నిజంగానే శత్రుదాడి జరిగిందా? అనే అనుమానం కలిగేలా మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. అందుకు గాను కలెక్టర్ దినేశ్‌కుమార్ బుధవారం ఉదయం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై మాక్‌డ్రిల్‌పై పలు సూచనలు చేశారు.
దేశానికి ప్రజలు అండగా నిలవాలి
తాజా పరిణామాల నేపథ్యంలో దేశానికి ప్రజలంతా అండగా నిలవాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ సూచించారు. మాక్‌డ్రిల్ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలను రక్షించుకునే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. ప్రజలు తాజా పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకుని తామంతా దేశానికి అండగా నిలవాలని, ఈ క్రమంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ప్రజల రక్షణకు ప్రభుత్వం చేపట్టే సూచనలు, సలహాలను పాటించాలన్నారు. మాక్‌డ్రిల్ నిర్వహించిన అధికారులు, పోలీస్, వ్యాయామ ఉపాధ్యాయులు, యువతకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి
దేశంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ఎస్‌పీ అమిత్‌బర్ధార్ సూచించారు. తప్పుడు సమాచారం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తాయన్నారు. ప్రజలంతా బాధ్యత గల పౌరులుగా ఉండాలని, దేశానికి అండగా నిలవాలన్నారు. వాస్తవాన్నే ప్రజలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ నాగవెంకట సాహిత్, ఏఎస్‌పీలు పంకజ్‌కుమార్ మీనా, నవజ్యోతి మిశ్రా, డీఆర్‌వో కె.పద్మలత, డ్వామా పీడీ డాక్టర్ విద్యాసాగరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.