పొంచి ఉన్న వ్యాధులు
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:12 AM
జిల్లాలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు తాజాగా కురిసిన వర్షాలు కొంతవరకూ ఉపశమనం కలిగించాయి. అయితే, ఇప్పుడే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు, వర్షాలతో ఎక్కడికక్కడ నీరు చేరిన నేపథ్యంలో అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వర్షాలతో మారిన వాతావరణం
ఎక్కడికక్కడ నీరు నిల్వ...దోమల వ్యాప్తికి అవకాశం
తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే
మలేరియా, చికున్ గున్యా, డెంగ్యూ వంటి వాటిన బారినపడే ప్రమాదం
కాచి చల్లార్చిన నీటినే తాగాలి
లేనిపక్షంలో టైఫాయిడ్, పచ్చకామెర్లు, గ్యాస్ర్టైటిస్ వచ్చే అవకాశం
విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు తాజాగా కురిసిన వర్షాలు కొంతవరకూ ఉపశమనం కలిగించాయి. అయితే, ఇప్పుడే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు, వర్షాలతో ఎక్కడికక్కడ నీరు చేరిన నేపథ్యంలో అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వర్షాలు పడుతున్నప్పుడు తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందని, ఆ నీటిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. బయట ఎక్కడపడితే అక్కడ గానీ, ఇంట్లో కుళాయి ద్వారా వచ్చే నీటిని గానీ తగిన జాగ్రత్తలు పాటించకుండా తాగడం వల్ల టైఫాయిడ్, గ్యాస్ర్టైటిస్, పచ్చకామెర్లు వంటి బారినపడే ప్రమాదం ఉందంటున్నారు. అందువల్ల ప్రజలు తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాచి, చల్లార్చిన నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా బయట ఆహారానికి దూరంగా ఉండడంతోపాటు ఇంట్లో కూడా వీలైనంత వరకూ వేడి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫ్లూ జ్వరాలు వ్యాప్తి
సీజన్ మారే సమయంలో కొన్నిరకాల ఫ్లూ వైరస్‌లు వ్యాప్తి చెంది జ్వరాలు బారినపడేలా చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభమైన తరువాత ఈ తరహా ఫ్లూ వైరస్‌లు యాక్టివేట్ అవుతుంటాయి. అయితే ఈ ఏడాది సీజన్‌లో ఇప్పుడు వర్షాలు కురుస్తున్నందున ఫ్లూ వైరస్‌లు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాతావరణం చల్లగా మారడంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వేధించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను ఇవి ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రెండు, మూడు రోజులకు మించి జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రతించడం కీలకమని సూచిస్తున్నారు.
దోమల వ్యాప్తికి అవకాశం
వర్షాలతో అనేకచోట్ల నీరు చేరుతుంది. దీనివల్ల దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మంచి నీటిలో డెంగ్యూ కారక దోమలు వృద్ధి చెంది వ్యాప్తి చెందుతాయి. కాబట్టి, వర్షపు నీరు ఇంటి చుట్టుపక్కల నిల్వ లేకుండా చూసుకోవాలి. వర్షపు నీరు కొన్నాళ్లకు మురికి నీరుగా మారుతుంది. అందులో మలేరియా, తదితర వాటికి కారణమైన దోమలు వృద్ధి చెందుతాయి. కాబట్టి, ఇంటి చుట్టుపక్కల, పూల కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలు ఇంట్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
అప్రమత్తతతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు
- డాక్టర్ సోమయాజులు, వైద్య నిపుణులు
వర్షాలు పడిన తరువాత అనేక రకాల వ్యాధులు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా కలుషిత నీరు, ఆహారాన్ని తీసుకోవడం ద్వారా డయేరియా, టైఫాయిడ్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఫ్లూ వైరస్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి నీటిని, ఆహారాన్ని తీసుకోవాలి. ఇంట్లో, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నిల్వ నీటిలో కొన్నిరకాల దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా బారినపడేలా చేస్తాయి.