Share News

పట్టు తప్పిందా... ప్రాణాలు పోయినట్టే!

ABN , Publish Date - Sep 12 , 2025 | 12:57 AM

ఒక పక్క ఉధృతంగా పారుతున్న వాగు. మరోవంక వాగుకు అడ్డంగా కట్టిన తీగ సాయంతో ప్రాణాలకు తెగించి పొలాలకు వెళుతున్న అన్నదాతలు. ఇదీ చోడవరం మండలం రాయపురాజుపేట పంచాయతీలోని రైతుల దుస్థితి.

పట్టు తప్పిందా... ప్రాణాలు పోయినట్టే!
ఒక చేతితో తలపై గడ్డిమోపును, మరో చేతితో తీగను పట్టుకుని ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుతున్న రైతు

రాయపురాజుపేట రైతుల జీవన పోరాటం

ఎర్రిగెడ్డపై 15 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వంతెన

ఇంతవరకు నిర్మాణానికి నోచుకోని కొత్త వారధి

తాటి దుంగలతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్న రైతులు

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కొట్టుకుపోయిన వంతెన

తీగ సాయంతో వాగును దాటాల్సిన దుస్థితి

చోడవరం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఒక పక్క ఉధృతంగా పారుతున్న వాగు. మరోవంక వాగుకు అడ్డంగా కట్టిన తీగ సాయంతో ప్రాణాలకు తెగించి పొలాలకు వెళుతున్న అన్నదాతలు. ఇదీ చోడవరం మండలం రాయపురాజుపేట పంచాయతీలోని రైతుల దుస్థితి.

రాయపురాజుపేట గ్రామానికి ఆనుకుని ఎర్రిగెడ్డ వాగు వుంది. దీనికి అవతలవైపున ఈ పంచాయతీ రైతులకు చెందిన సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూములు వున్నాయి. గతంలో వాగుపై వంతెన ఉండేది. 2010లో సంభవించిన తుఫాన్‌కు వంతెన కొట్టుకుపోయింది. కొత్త వంతెన నిర్మించాలని అప్పటి నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వర్షా కాలంలో గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొన్నిసార్లు రోజుల తరబడి పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటున్నది. కొంతమంది రైతులు సొంత సొమ్ముతో ఇనుప గడ్డర్లు వేసి, వాటిపై తాటి దుంగలు పేర్చి తాత్కాలిక వంతెనను నిర్మించుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గెడ్డలో వరద ప్రవాహం ధాటికి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. రైతుల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీనిని అధిగమించేందుకు సమీపంలో వున్న చెక్‌ డ్యామ్‌కు ఇటువైపు నుంచి అటువైపునకు తీగ కట్టారు. దానిని పట్టుకుని వరద నీటిలో నడుచుకుంటూ పొలాలకు వెళ్లి వస్తున్నారు. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఎర్రిగెడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. తీగను పట్టుకుని వాగుదాటే క్రమంలో ఏ మాత్రం పట్టుతప్పినా నీటిలో పడి కొట్టుకుపోతారు. ప్రమాదమని తెలిసినప్పటికీ పొలాలకు వెళ్లాల్సి రావడంతో ప్రాణాలకు తెగించి సాహసం చేయాల్సి వస్తున్నదని రైతులు చెబుతున్నారు.

వాగు దాటితేనే పశువులకు మేత

ఎల్లపు నూకరాజు, రాయపురాజుపేట

వాగుపై వున్న తాత్కాలిక వంతెన మూడు వారాల క్రితం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. మా పొలాలు వాగుకు అవతల వైపున వున్నాయి. పశువులకు రోజూ పచ్చిమేత అవసరం. గెడ్డను దాటడానికి చెక్‌ డ్యామ్‌ వద్ద తీగను కుట్టకున్నాం. తలపై గడ్డిమోపు పెట్టుకుని, ఒక చేత్తో తీగను పట్టుకుని గెడ్డను దాడుతున్నాను. ఈ క్రమంలో పట్టుతప్పితే నీటిపడి కొట్టుకుపోవడం ఖాయం.

Updated Date - Sep 12 , 2025 | 12:57 AM