Share News

పంచాయతీల ఆదాయానికి గండి!

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:41 PM

‘ఆనందపురం మండలం పెద్దిపాలెం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌ను రెండేళ్ల క్రితం నుంచి అద్దెకు ఇస్తున్నారు.

పంచాయతీల  ఆదాయానికి గండి!

  • వాణిజ్య భవనాలపై అపరిమిత ప్రేమ

  • తక్కువ మొత్తం పన్ను వసూలు

  • యాజమాన్యాలతో పంచాయతీలు కుమ్మక్కు

  • కార్యదర్శులకు కాసుల వర్షం

విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):

‘ఆనందపురం మండలం పెద్దిపాలెం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌ను రెండేళ్ల క్రితం నుంచి అద్దెకు ఇస్తున్నారు. పంచాయతీకి పన్ను చెల్లించడంలేదు. పంచాయతీ కార్యదర్శి రెండేళ్లుగా ఈ విషయమే విస్మరించారు. చివరకు డీపీవో ఆదేశాలతో ఏడాదికి రూ. 10 లక్షల చొప్పున నోటీస్‌ సిద్ధంచేస్తే పంచాయతీరాజ్‌ ఉన్నతాఽధికారి బంధువులతో ఒత్తిడి తెస్తున్నారు.

‘ఆనందపురం మండలం గండిగుండంలో ఎంఎన్‌సీ కంపెనీకి అద్దెకు ఇచ్చే భారీ గోదాముకు ఏడాదికి కేవల ం రూ.40వేలు మాత్రమే పన్ను వేశారు. ఇదేమంటే ఒత్తిడి రావడంతో తక్కువ పన్ను వేశానని కార్యదర్శి చెబుతున్నారు. వాస్తవంగా గోదాము విస్తీర్ణం కొలిచి పన్నువేస్తే ఏడాదికి రూ.మూడు లక్షల వరకు పంచాయతీకి ఆదాయం వస్తుంది. నాలుగైదేళ్లుగా పంచాయతీ సుమారు రూ.ఎనిమిది లక్షల ఆదాయం కోల్పోయింది.

‘ఆనందపురంలో ఇంటి విస్తీర్ణం వెయ్యి చదరపు అడుగులు. ఏటా రూ.ఎనిమిదివేల పన్ను చెల్లిస్తున్నట్టు యజమాని వివరించారు. అదే వ్యాపార సంస్థలు ఇంకెంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో వాణిజ్య భవనాల నుంచి పన్నుల వసూళ్లలో భారీ గోల్‌మాల్‌ జరుగుతోంది. నామమాత్రంగా పన్ను విధించి పంచాయతీల ఆదాయానికి గండికొడుతున్నారు. అదే సమయంలో పంచాయతీ కార్యదర్శులు అడ్డగోలుగా కాసులు కూడబెట్టుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి సర్పంచ్‌లు తోడు కావడంతో పంచాయతీలు ఆదాయం కోల్పోతున్నాయి.

జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో 79 గ్రామపంచాయతీలున్నాయి. నగరానికి ఆనుకుని ఎక్కువగా ఉండడంతో భారీగా దుకాణాలు, షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, పెట్రోల్‌బంకులు, ఇంజనీరింగ్‌, పాలటెక్నిక్‌, రెసిడెన్షియల్‌ కళాశాలలున్నాయి. రిజిస్ట్రేషన్‌ విలువను పరిగణనలోకి తీసుకుని ఇల్లు, వాణిజ్యభవనాలకు పన్నులు విధిస్తారు. అయితే ఇందులో నిబంధనలు పాటించడంలేదు. వాణిజ్యభవనాల యజమానులతో పంచాయతీ పాలకులు మిలాఖత్‌వుతున్నారు. పంచాయతీల్లో ఆదాయం పెంచాల్సిన కార్యుదర్శులు కాసులకు కక్కుర్తి పెడుతున్నారు. పంచాయతీల్లో చాలా వరకు సర్పంచ్‌ మాటే చెల్లుబాటు కావడంతో పంచాయతీ తీర్మానం మేరకు కొద్దిమొత్తం పన్నువిధిస్తున్నారు. జిల్లాలో ఆయా మండలాలనుంచి గత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం(వాణిజ్య, వ్యాపార భవనాలు, ఇతర షాపుల నుంచి ) కేవలం రూ.2.10 కోట్లు ఉంది.

ఇంజనీరింగ్‌, రెసిడెన్షియల్‌ కళాశాలలు, వాణిజ్యభవనాలు, గోదాములు, ఇతర దుకాణాల నుంచి నిబంధనల మేర పన్ను వసూలు చేయడంలో పంచాయతీలు విఫలమవుతున్నాయి. ఆనందపురం మండలంలో ఒక రెసిడెన్షియల్‌ స్కూలు ఏటా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పన్ను చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.4 లక్షలే వసూలు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదుల మేరకు చదరపు అడుగుకు రూ.1064 చొప్పున పన్ను విధిస్తూ నోటీసులు జారీచేస్తే అధికారపార్టీకి చెందిన వాడినంటూ బెదిరింపులకు దిగారు. కొద్దికాలం క్రితం మూసివేసిన ఇంజనీరింగ్‌ కళాశాల సుమారు రూ.50 లక్షల వరకు పన్ను చెల్లించాలి. అది కూడా తూతూమంత్రంగా వేసిన పన్ను మాత్రమే. అయినా పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

పంచాయతీల్లో పన్నుల ఆదాయం పెంచుకోవాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీచేయడంతో జిల్లాలో 10 వేల చదరపు అడుగులు దాటి విస్తీర్ణం ఉన్న వాణిజ్య సముదాయాలను గుర్తించి, పన్ను విధించే పనిలో అధికారులున్నారు. ఇలాంటివి జిల్లాలో 94 ఉండగా ఇంతవరకు 21 భవనాలు/సముదాయాలకు పన్ను విఽధించారు. కమిషనర్‌ ఆదేశాలలో వాటి కొలతలు తీసుకున్నప్పుడు గతంలో విఽధించిన పన్నుకు. ప్రస్తుత పన్నుకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిచింది. అంటే ఏళ్లతరబడి పన్ను అధికారులు విఫలం కావడంతో పంచాయతీలు భారీ ఆదాయం కోల్పోయాయి. కాగా మూడువేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న వ్యాపార సంస్థలు వందల్లో ఉంటాయి. వీటిని తనిఖీ చేసి నిబంధనల మేరకు పన్ను విధిస్తే జిల్లాలో పన్నేతర ఆదాయం కోట్లకు పెరుగుతుంది.

పన్నేతర ఆదాయంపై జిలా ్లపంచాయతీ అధికారి ఎంఎన్‌వీ. శ్రీనివాసరావు వద్ద ప్రస్తావించగా నిబంధన మేర పన్ను విధించాలని కార్యదర్శులకు ఆదేశించామన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, మాల్స్‌ నుంచి పన్ను వసూలు చేసి ఆదాయం పెంచుకునే దిశగా పనిచేస్తున్నామన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Aug 10 , 2025 | 11:41 PM