గోతుల్లో కూరుపోయిన లారీలు
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:03 AM
వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రహదారిలో మాడుగుల మండలం ఎం.కోడూరు వద్ద భారీ గోతుల్లో శుక్రవారం ఉదయం లారీ, మినీ వ్యాన్ కూరుకుపోయాయి. రెండు వాహనాలు పక్కపక్కనే బురదలో దిగబడిపోవడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇరువైపులా సుమారు రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
ఎం.కోడూరు వద్ద రెండు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్
తీవ్ర ఇబ్బందులు పడిన వాహనదారులు, ప్రయాణికులు
మాడుగుల రూరల్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): వడ్డాది- పాడేరు ఆర్‌అండ్‌బీ రహదారిలో మాడుగుల మండలం ఎం.కోడూరు వద్ద భారీ గోతుల్లో శుక్రవారం ఉదయం లారీ, మినీ వ్యాన్ కూరుకుపోయాయి. రెండు వాహనాలు పక్కపక్కనే బురదలో దిగబడిపోవడంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఇరువైపులా సుమారు రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
బుచ్చెయ్యపేట మండలం వడ్డాది నుంచి మాడుగుల మండలం తాటిపర్తి వరకు ఆర్‌అండ్‌బీ రహదారిపై పలుచోట్ల గోతులు ఏర్పడి దారుణంగా తయారైంది. మాడుగులతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరుతోపాటు పలు మండలాల ప్రజలు ఈ రోడ్డు మీదుగానే అనకాపల్లి, విశాఖ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ రకాల రవాణా వాహనాలు కూడా వెళుతుంటాయి. రహదారిపై ఏర్పడిన గోతులను మెటల్, తారు/ సిమెంట్‌తో కప్పకుండా, మట్టిపోసి వదిలేశారు. దీంతో వర్షం కురిస్తే వాహనాలు మట్టిలో కూరుకుపోయి, ట్రాఫిక్ స్తంభిస్తున్నది. శుక్రవారం ఉదయం ఐదు గంటల సమయంలో మైదాన ప్రాంతం నుంచి ఒక లారీ, మినీ వ్యాను పాడేరు వెళుతున్నాయి. ఎం.కోడూరు వద్ద రోడ్డుపై వున్న బురద గోతుల్లో పక్కపక్కనే దిగబడిపోయాయి. రెండు లారీల మధ్య చిన్నపాటి ఖాళీ మాత్రమే వుండడంతో దిచక్ర వాహనాలు మినహా మరే ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇరువైపులా సుమారు కిలోమీటరు మేర పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారికి ఏం చేయాలో పాలుపోలేదు. వీరిలో కొంతమంది అనకాపల్లి, విశాఖపట్నం నుంచి దూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లాల్సి వారు వున్నారు. తాము ఎక్కడకుండానే రైళ్లు వెళ్లిపోతాయేమోనని ఆందోళన చెందారు. బురదలో కూరుకుపోయిన వాహనాల సిబ్బంది, స్థానికుల సాయంతో ఎక్స్‌కవేటర్‌ను రప్పించి బురదలో నుంచి వాహనాలను బయటకు తీయించారు. సుమారు రెండు గంటల తరువాత వాహనాలు కదిలాయి. సర్పంచ్ గొల్లవిల్లి సంజీవరావు కంకరరాళ్లను రప్పించి గోతులు కప్పించారు.