Share News

మత్స్యావతారంలో జగన్నాథుడు

ABN , Publish Date - Jun 29 , 2025 | 12:41 AM

జగన్నాథస్వామి శనివారం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మత్స్యావతారంలో జగన్నాథుడు

మహారాణిపేట, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి):

జగన్నాథస్వామి శనివారం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. టౌన్‌ కొత్తరోడ్డులోని ఆలయం నుంచి బలభద్ర, సుభద్ర సమేతంగా జగన్నాథ స్వామి విగ్రహాలను ప్రత్యేక రథంపై శుక్రవారం టర్నర్‌చౌలీ్ట్రలోని గుండిచా మందిరానికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ స్వామి దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. తొలిరోజు మత్స్యావతారంలో అలంకరించారు. ఉదయం స్వామివారికి విశేష అర్చనలు, సహస్ర నామార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌ వినాయక దేవస్థానం తరపున వ్యవస్థాపక సభ్యులు టి.ఆర్‌.చోళన్‌, ఈవో డీవీవీ ప్రసాద్‌, టి.రాజేశ్వరన్‌లు జగన్నాథ స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తుల కోసం ఈవో టి.రాజగోపాల్‌రెడ్డి అన్న సమారాధన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.


అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం

లంకెలపాలెం కూడలిలో రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖాధికారుల రిపోర్టు

లంకెలపాలెం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి):

జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలిలో ఈ నెల 23న చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదానికి అతి వేగం, డ్రైవర్‌ లక్కిరెడ్డి కోటిరెడ్డి నిర్లక్ష్యమే కారణమని రవాణా శాఖాధికారులు నిర్ధారించారు. విశాఖపట్నం పోర్టు నుంచి పప్పుల బస్తాలతో తెలంగాణాలోని సిద్ధిపేట వెళుతున్న లారీ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న మూడు కార్లు, ఆటో, కంటైనర్‌ లారీ, పలు ద్విచక్ర వాహనాలపై దూసుకువెళ్లడంతో పచ్చికూర గాంధీ, కొణతాల అచ్చెయ్యనాయుడు, వై.ఎర్రప్పడు అనే ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాలాపు రామ్‌కుమార్‌, రేఖ అప్పలరాజు ఈ నెల 26న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకునేందుకు జిల్లా రవాణా శాఖాఽధికారి గోపిశెట్టి మనోహర్‌ రెండు రోజుల క్రితం లంకెలపాలెం జంక్షన్‌ను సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై పరవాడ పోలీసులతో మాట్లాడిన అనంతరం రవాణా శాఖ ఎంవీ ఇన్‌స్పెకర్లతో కూడిన బృందాన్ని నియమించారు. ఆ బృందం అన్ని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం వల్లనే పెనుప్రమాదం సంభవించిందని నిర్ధారించారు. స్థానిక పెట్రోల్‌ బంకు నుంచి లంకెలపాలెం జంక్షన్‌ వరకూ సుమారు అర కిలోమీటరు మేర రోడ్డు పూర్తిగా పల్లంగా ఉండడానికి తోడు డ్రైవర్‌ అధిక వేగంతో దూసుకురావడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగిందని, ఇది కేవలం డ్రైవర్‌ నిర్లక్ష్యమేనని తేల్చారు.


తహశీల్దార్ల బదిలీల్లో మార్పులు

ఆనందపురం తహశీల్దారుగా శ్రీవల్లి

సీతమ్మధార తహశీల్దార్‌గా ఎంవీవీ ప్రసాద్‌

పెందుర్తి, గాజువాక డీటీలకు తహశీల్దారు బాధ్యతలు

విశాఖపట్నం, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో తహశీల్దారు కేడర్‌ బదిలీల్లో కొన్ని మార్పులు చేశారు. గాజువాక తహశీల్దారు తోట శ్రీవల్లిని గతంలో వీఎంఆర్‌డీఏ స్పెషల్‌ తహశీల్దార్‌గా బదిలీ చేశారు. ఇప్పుడు ఆమెను ఆనందపురం తహశీల్దారుగా నియమించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చిన ఎంవీవీ ప్రసాద్‌ను గతంలో కలెక్టరేట్‌లో నియమించారు. ఇప్పుడు సీతమ్మధార తహశీల్దార్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి పెందుర్తి తహశీల్దారుగా బదిలీ అయిన టి.రామకృష్ణను వీఎంఆర్‌డీఏ స్పెషల్‌ తహశీల్దారుగా, విజయనగరం జిల్లా నుంచి విశాఖ జిల్లాకు కేటాయించిన బి.గురుమూర్తిని కలెక్టరేట్‌లోని భూ పరిరక్షణ విభాగం స్పెషల్‌ తహశీల్దారుగా నియమించారు. కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం రాత్రి డీఆర్వో ఉత్తర్వులు జారీచేశారు. గాజువాక, పెందుర్తిల్లో డీటీలుగా ఉన్న బి.శ్రీనివాస్‌, ఎ.సంతోష్‌లకు ఆయా మండలాల్లో తహశీల్దార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

తహశీల్దారు కొలువు కోసం శ్రీవల్లి పట్టు

భూపరిపాలనా ముఖ్య కమిషనర్‌ కార్యాలయం నుంచి రెండున్నరేళ్ల క్రితం విశాఖ జిల్లాకు వచ్చిన తోట శ్రీవల్లి పద్మనాభం, గాజువాకల్లో తహశీల్దారుగా పనిచేశారు. ఈనెల తొమ్మిదో తేదీన జరిగిన బదిలీల్లో ఆమెను గాజువాక నుంచి వీఎంఆర్‌డీఎ స్పెషల్‌ తహశీల్దారుగా నియమించారు. ఆ పోస్టులో చేరేందుకు ఆమె ఇష్టపడలేదు. సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన తాను తహశీల్దారు తప్ప ఇతర పోస్టుల్లో పనిచేస్తే సర్వీస్‌కు ఉపయోగపడదని చెబుతూ జిల్లాలో కీలకమైన ఆనందపురం మండలంలో అవకాశం దక్కించుకున్నారు. ఈ విషయంలో అమరావతి స్థాయి నుంచి ఒత్తిడి వచ్చినట్టు ప్రచారం సాగుతుంది.


‘ఉక్కు’లో వీఆర్‌ఎస్‌ కోసం భారీగా దరఖాస్తులు

ఇప్పటికే రెండు వేల మందికిపైగా దరఖాస్తు?

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): వీఆర్‌ఎస్‌ కోసం స్టీల్‌ ప్లాంటులో ఇప్పటివరకూ సుమారు రెండు వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. స్టీల్‌ ప్లాంటులో తొలిసారి 1,163 మందికి వీఆర్‌ఎస్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో విడత యాజమాన్యం అవకాశం కల్పించడంతో అత్యధికులు వీఆర్‌ఎస్‌ పట్ల ఆసక్తి చూపుతున్నారు. వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉన్నప్పటికీ...ఇప్పటికే సుమారు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.

Updated Date - Jun 29 , 2025 | 12:41 AM