Share News

స్టాండింగ్‌ కమిటీలో ఒక స్థానం కోల్పోవడంపై లోకేశ్‌ సీరియస్‌

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:43 AM

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోవడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా పరిగణించారు.

స్టాండింగ్‌ కమిటీలో ఒక స్థానం కోల్పోవడంపై లోకేశ్‌ సీరియస్‌

  • పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌

  • ఒక్క సీటే గదా అని...వదిలేస్తే ఎలాగంటూ అసంతృప్తి

  • కూటమి పార్టీలు, నేతల మధ్య సమన్వయ లోపాన్ని బహిర్గతం చేసిందంటూ వ్యాఖ్య

  • నివేదిక ఇవ్వాలంటూ ఆదేశం

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోవడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా పరిగణించారు. పోయింది ఒక్క సీటే అయినా గెలిచేందుకు ఉన్న అవకాశాలను ఎందుకు జారవిడుచుకున్నారంటూ నగర నేతలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విశాఖ జిల్లాకు చెందిన కీలక నేతలతో ఆయన గురువారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమరావతి వర్గాల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఈనెల ఆరో తేదీన నిర్వహించిన జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పది స్థానాలకు కూటమి తొమ్మిది గెలుచుకుంది. మరొక స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. కూటమి అభ్యర్థి ఓటమికి గల కారణాలపై తొలుత పార్టీ కార్యాలయం నుంచి ఆరా తీశారు. అనంతరం నగరానికి చెందిన కొందరు నేతలతో గురువారం సాయంత్రం లోకేశ్‌ టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గతంలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకున్నామని, ఆ తరువాత మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులు కూడా దక్కించుకున్నామని గుర్తుచేశారు. అటువంటిది ఇప్పుడు స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో కేవలం ఒక ఓటు తేడాతో సీటును కోల్పోవడం కూటమి పార్టీలు, నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని తేటతెల్లం చేస్తుందని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఒక సీటు అని వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. దీనికి ఒకరిద్దరు నేతలు బదులిస్తూ..స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు మేయర్‌, ఇద్దరు ఎమ్మెల్యేలు చూస్తున్నారని తాము కొంత నిర్లిప్తతతో ఉన్నాం తప్ప మరొకటి కాదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

జీవీఎంసీలో కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉండడానికి నగరంలో పార్టీ కీలక నేతలు కారణమని మరో నేత వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి వచ్చిన కార్పొరేటర్లను కనీసం పట్టించుకోకపోవడంతో వారిలో కొందరు ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేశారని అనుమానం వ్యక్తంచేశారు. ముఖ్యంగా ఒకరిద్దరు ఎమ్మెల్యేల ప్రవర్తన ఇందుకు కారణమనే వాదన ఉందని వివరించారు. ఇటీవల కార్పొరేటర్లు సూచించిన పనులను జీవీఎంసీ అధికారులు మంజూరుచేస్తే ఒక ప్రజా ప్రతినిధి అభ్యంతరం వ్యక్తం చేయడంపై కొందరు కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారని, బహుశా ఇది కూడా ఓటమికి కారణం కావచ్చునని పేర్కొన్నారు. చివరగా లోకేశ్‌ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు విశ్లేషిస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో నివేదిక తయారుచేసి లోకేశ్‌తోపాటు సీఎంకు పంపాలని నిర్ణయించారు. బహుశా ఒకటి, రెండు రోజుల్లో నివేదిక పంపనున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:43 AM