Share News

చంద్రంపాలెం పాఠశాలపై లోకేశ్‌ ఫోకస్‌

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:16 AM

చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్‌ అభివృద్ధిపై మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు.

చంద్రంపాలెం పాఠశాలపై  లోకేశ్‌ ఫోకస్‌

మైదానం అభివృద్ధికి ఆదేశాలు

రూ.ఐదు లక్షలతో తాత్కాలికంగా పనులు

రూ.కోటితో పక్కాగా చేపట్టేందుకు విద్యా శాఖ ప్రతిపాదనలు

విశాఖపట్నం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి):

చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్‌ అభివృద్ధిపై మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేకంగా దృష్టిసారించారు. పాఠశాలలో వసతులు మెరుగుపరచాలని ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా పాఠశాల మైదానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ఏఐ ల్యాబ్స్‌ ప్రారంభోత్సవం నిమిత్తం గత నెల పాఠశాలకు వచ్చిన ఆయన...బురదమయంగా ఉన్న మైదానాన్ని చూసి అసంతృప్తి వ్యక్తంచేశారు. పాఠశాల మైదానాన్ని బాగు చేయించాలని డీఈవో ప్రేమ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ ఇంజనీర్లు ఇటీవల పాఠశాల మైదానాన్ని పరిశీలించి వర్షపు నీరు చేరకుండా తాత్కాలిక పనులు చేపట్టేందుకు రూ.ఐదు లక్షలతో ప్రతిపాదనలు తయారుచేసి డీఈవోకు అందజేశారు. డీఈవో సూచనతో వారం క్రితం మైదానంలో మట్టి వేసి కొంతవరకు గోతులు లేకుండా చదునుచేశారు. ఇది తాత్కాలికమేనని, వర్షం వచ్చినప్పుడు మళ్లీ నీరు నిలిచిపోయి బురదమయం అవుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పాఠశాల ఉన్న ప్రాంతం ఒకప్పుడు చెరువు కావడంతో పరిసర ప్రాంతాల్లో వర్షం పడితే నీరు రావడం జరుగుతుంది. చుట్టూ ప్రహరీ గోడ నిర్మించినా పాఠశాల ఆవరణలో వర్షం నీరు బయటకు వెళ్లే మార్గం లేదు. వందల లారీల మట్టి తోలినా మైదానం పరిస్థితి మెరుగుపడలేదు. వర్షం వస్తే విద్యార్థులు బురదలో తరగతులకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్‌ తొలుత పాఠశాల మైదానాన్ని పూర్తిగా బాగుచేయాలని అధికారులు ఆదేశించారు. మైదానాన్ని పక్కాగా అభివృద్ధి చేయాలంటే రూ.కోటి అవసరమని ఇంజనీర్లు చెబుతున్నారు. పాఠశాల చుట్టూ డ్రైన్లు నిర్మించాలని, అలాగే మైదానం ఎత్తు పెంచాలని చెబుతున్నారు. మరింత మట్టి తోలి రోలింగ్‌ చేయాల్సి ఉంటుందని ఇంజనీర్‌ ఒకరు పేర్కొన్నారు. ఈ విషయం డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ వద్ద ప్రస్తావించగా మంత్రి లోకేశ్‌ ఆదేశాలతో చంద్రంపాలెం పాఠశాల మైదానాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తాత్కాలికంగా ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ కొంత వరకు మట్టివేసి చదునుచేస్తోందన్నారు. భవిష్యత్తులో మైదానం పక్కాగా ఉండాలంటే మరిన్ని నిధులు అవసరమన్నారు. ఇంజనీరింగ్‌ నిపుణులతో ప్రతిపాదన తయారుచేయించి కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 01:16 AM