పిల్లిగెడ్డ వంతెన వద్ద కూరుకుపోయిన లోడ్ లారీ
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:27 PM
జీకేవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పిల్లిగెడ్డ వంతెన వద్ద శనివారం ఉదయం సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ బురదలో కూరుకుపోయింది.

నాలుగు గంటల పాటు ఆంధ్రా- ఒడిశా రాకపోకలకు అంతరాయం
ఎక్స్‌కవేటర్‌తో లారీని బయటకు తీయడంతో రాకపోకలు ప్రారంభం
వంతెన అప్రోచ్‌కు బీటీ వేయకపోవడమే కారణం
వర్షాలకు బురదమయమైన అప్రోచ్
సీలేరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ పరిధిలోని ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పిల్లిగెడ్డ వంతెన వద్ద శనివారం ఉదయం సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ బురదలో కూరుకుపోయింది. దీంతో ఆంధ్రా-ఒడిశా ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పిల్లిగెడ్డ వంతెన కొత్తగా నిర్మించారు. వంతెనకు రెండు పక్కల అప్రోచ్ రోడ్డుకు బీటి వేయకుండా ఎర్రమట్టి వేసి కాంట్రాక్టర్ వదిలేశాడు. దీంతో గత పది రోజులుగా విస్తారంగా కురిసిన వర్షాలకు పిల్లిగెడ్డ వంతెనకు రెండు పక్కలా వేసిన ఎర్రమట్టి బురదగా మారింది. దీంతో ఆంధ్రా, ఒడిశా నుంచి వాహనాలు రాకపోకలు సాగించడంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వాహనాలు అతి కష్టం మీద వస్తూ.. పోతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి ఒడిశాలోని చిత్రకొండకు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ శనివారం ఉదయం ఇక్కడ బురదలో కూరుకుపోయింది. సుమారు నాలుగు గంటల పాటు సీలేరు-చిత్రకొండ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్స్‌కవేటర్ సహాయంతో బురదలో కూరుకుపోయిన లోడ్ లారీని బయటకు తీయడంతో నాలుగు గంటల తర్వాత రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్ వద్ద బురద లేకుండా చర్యలు తీసుకోవాలని వాహనదార్లు కోరుతున్నారు.