ఆధార్‌తో వాహనాల అనుసంధానం
ABN , Publish Date - Sep 26 , 2025 | 01:24 AM
మోటారు సైకిల్ నుంచి భారీ వాహనం వరకూ అన్నింటినీ యజమానుల ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ నిర్ణయం
జిల్లాలో 16 లక్షలకుపైగా వాహనాలు
యజమానుల ఆధార్ నంబర్ లింకేజీ
సచివాలయాల సిబ్బందికి బాధ్యతలు
విశాఖపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
మోటారు సైకిల్ నుంచి భారీ వాహనం వరకూ అన్నింటినీ యజమానుల ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన డేటాను జిల్లాకు పంపింది. సంక్షేమ పథకాల అమలుకు ఇది ఎంతో కీలకంగా మారనున్నది. విశాఖ జిల్లాలో సుమారు 16 లక్షల వాహనాలు ఉన్నాయి. వాటిని యజమానుల ఆధార్ నంబరుతో అనుసంధానం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. గతంలో ఒకసారి వాహనదారుల వివరాలు పంపి ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించినప్పుడు సుమారు మూడు లక్షల మందే ముందుకువచ్చారు. ఈ పర్యాయం అలా కాకుండా ప్రతి వాహనాన్ని ఆధార్ నంబరుతో అనుసంధానం చేసే బాధ్యత గ్రామ/వార్డు సచివాలయానికి అప్పగించారు.
జిల్లాలో గల 607 సచివాలయాల సిబ్బంది తమ పరిధిలో వాహనదారులకు ఫోన్ చేసి ఆధార్ నంబరుతో వారి వాహనాలు అనుసంధానం చేసేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సుమారు 16 లక్షల వాహనాలను ఆధార్ నంబరుతో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తిచేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి వాహనదారుడి నుంచి అతని పేరు, వృత్తి, చిరునామా, వాహనం నంబరు, రకం తదితర అంశాలను నమోదుచేయనున్నారు. ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులున్నాయని సచివాలయ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత వాహనాల వరకు అది కూడా వాహనదారుడి వద్ద సంబంధిత వాహనం ఉంటే ఆధార్‌తో అనుసంధానం చేయడం కొంతవరకు సులువుగా ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ వాహనం విక్రయించిన తరువాత దాని రిజిస్ట్రేషన్ బదలాయింపు జరగకపోతే అనుసంధానం చేయడం ఇబ్బందిగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. కంపెనీ వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన వాహనాలు, పెద్దపెద్ద ట్రాన్స్‌పోర్టు కంపెనీల వాహనాలకు ఆధార్ నంబరుతో అనుసంధానం చేయడం అంత సులువు కాదని సచివాలయ ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. మిగతా వాహనాలకు సంబంధించి ఆయా కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ట్రాన్స్‌పోర్టు కంపెనీలకు ప్రత్యేకించి లేఖలు రాసి వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. తూర్పు నావికాదళానికి చెందిన వాహనాలు అనుసంధానం చేయడానికి జిల్లా యంత్రాంగం ద్వారా ప్రయత్నించాల్సి ఉందని పేర్కొంటున్నారు.