గిరిజనుల జీవితాల్లో వెలుగులు
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:42 AM
స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా విద్యుత్ వెలుగులు ఎలా ఉంటాయో చూడని మండలంలోని రొంపల్లి పంచాయతీ మారుమూల గూడెం గ్రామస్థులు మంగళవారం రాత్రి ఇళ్లల్లో విద్యుత్ కాంతులను తొలిసారి చూశారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి విద్యుత్ కాంతులు చూసిన గూడెం గ్రామస్థులు
కూటమి ప్రభుత్వం మేలు మరువలేమని ఆనందం
అనంతగిరి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా విద్యుత్ వెలుగులు ఎలా ఉంటాయో చూడని మండలంలోని రొంపల్లి పంచాయతీ మారుమూల గూడెం గ్రామస్థులు మంగళవారం రాత్రి ఇళ్లల్లో విద్యుత్ కాంతులను తొలిసారి చూశారు. ఈ గ్రామంలో 18 గిరిజన కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇప్పటి వరకు కాగడాల వెలుతురులోనే వీరు జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీరి సమస్యపై దృష్టి పెట్టింది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు గత నెల 11న విద్యుత్ శాఖ ఎస్‌ఈ జీఎన్ ప్రసాద్, డీఈఈ పి.వేణుగోపాల్, ఏడీ ఆనంద్‌మురళి ఈ గ్రామాన్ని సందర్శించారు. రూ.80 లక్షల వ్యయంతో తొమ్మిది కిలోమీటర్ల పొడవున 217 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ఈ గ్రామంలోని ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ప్రతి ఇంటికి 5 బల్బులు, ఒక ఫ్యాన్ వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.