Share News

రాగల ఐదు రోజుల్లో తేలికపాటి జల్లులు

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:42 AM

జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ సీహెచ్‌.ముకుందరావు తెలిపారు. మంగళవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో జరిగిన వాతావరణ ఆధారిత వ్యవసాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.1 నుంచి 28.5 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.3 నుంచి 22.2 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం వుందన్నారు. ఈ సందర్భంగా రబీలో సాగుచేసే వరి, అపరాలు, మొక్కజొన్న, రాగి, కూరగాయ పంటల గురించి ఆయన పలు వివరాలను వెల్లడించారు.

రాగల ఐదు రోజుల్లో తేలికపాటి జల్లులు

రబీ వరి సాగుకు అనువైన రకాలను ఎంచుకోవాలి

మొక్కజొన్నలో హైబ్రిడ్‌ రకాలు మేలు

రాగిలో ఇంద్రావతి, వేగావతి అనువైనవి

వరి మాగాణుల్లో పెసర, మినుము సాగు

ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ ముకుందరావు

అనకాపల్లి అగ్రికల్చర్‌, డిసెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ సీహెచ్‌.ముకుందరావు తెలిపారు. మంగళవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో జరిగిన వాతావరణ ఆధారిత వ్యవసాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27.1 నుంచి 28.5 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.3 నుంచి 22.2 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం వుందన్నారు. ఈ సందర్భంగా రబీలో సాగుచేసే వరి, అపరాలు, మొక్కజొన్న, రాగి, కూరగాయ పంటల గురించి ఆయన పలు వివరాలను వెల్లడించారు.

రబీలో సాగుకు ఎంటీయూ 1121, ఎంటీయూ 1153, ఎంటీయూ 1156, ఎంటీయూ 1293, ఎస్‌ఎల్‌ఆర్‌ 3238, బీపీటీ 2411, ఎన్‌ఎల్‌ఆర్‌ 3354 వంటి వరి రకాలు అత్యంత అనుకూలం. ఎకరాకు 20-25 కిలోల విత్తనం అవసరం. నారుమడి కోసం ఐదు సెంట్ల స్థలాన్ని సిద్ధం చేసుకొని రెండు కిలోల యూరియా, ఆరు కిలోల సింగిల్‌ సూపర్‌ఫాస్పేట్‌, రెండు కిలోల మ్యురేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసుకోవాలి. నారుమడిలో జింకు లోపం గమనిస్తే.. లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. ఇనుముధాతు లోపం నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున అన్నబేది, ఒక గ్రాము నిమ్మఉప్పు కలిపి పిచికారీ చేయాలి.

మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్‌ రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం సరిపోతుంది. నాటేముందు కాప్టన్‌ లేదా మాంకోజెట్‌ మందు కిలో విత్తనాలకు మూడు గ్రాముల చొప్పున కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తిన 20 రోజుల వరకు కత్తెర పురుగు ఆశించకుండా ఉండేందుకు కిలో విత్తనానికి ఆరు మిల్లీ లీటర్ల పైయాంత్రినిలిప్రోల్‌, థయోమిత్పాకం మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. కలుపు నివారణకు విత్తిన మూడు రోజులలోపు అట్రాజిన్‌ మందును లీటరు నీటికి ఐదు గ్రాములచొప్పున కలిపి పిచికారీ చేయాలి.

రాగిలో కొత్తగా వచ్చిన ఇంద్రావతి, వేగావతి వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎకరానికి 2.5 కిలోల చొప్పున విత్తనం తీసుకొని నారుమడిలో చల్లాలి. నెల రోజులు పెరిగిన తరువాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.

వరి మాగాణుల్లో రబీ పంటగా అపరాలు వేసే రైతులు పెసరలో ఎల్‌జీజీ 630, ఎల్‌జీజీ 600, ఎల్‌జీజీ 607, ఐపీఎం 2-14 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎకరాకు 12-13 కిలోల విత్తనం అవసరం. మినుము సాగు చేసేటట్టయితే ఎల్‌బీజీ 884, ఎల్‌బీజీ 904, ఎల్‌బీజీ 752, జీబీజీ 1, టీబీజీ 104 వంటి రకాలు అనువైనవి. ఎకరాకు 16-18 కిలోల చొప్పున విత్తనం అవసరం. నాటే ముందు కిలో విత్తనానికి కాప్టన్‌ 2.5 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్‌ ఐదు మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

చెరకు మొక్క తోటల కంటే ముందు కార్సీ తోటలను నరకాలి. బెల్లం తయారుచేసే రైతులు చెరకును మొదలకంటా నరకాలి. చెరకు నరికిన 24 గంటల్లో గానుగాడించి బెల్లం తయారుచేసుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తీగజాతి కూరగాయ పంటలను బూజు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణ కోసం లీటరు నీటికి మెటలాక్సిల్‌ రెండు గ్రాములచొప్పున కలిపి పిచికారీ చేయాలి తెలిపారు. సమావేశంలో శాస్త్రవేత్తలు కేవీ రమణమూర్తి, డి.ఆదిలక్ష్మి, వి.గౌరి, ఆర్‌.సరిత, సిహెచ్‌.రామలక్ష్మి, వి.చంద్రశేఖర్‌, ఎ.అలివేణి పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:42 AM