Share News

రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:05 AM

రాగల ఐదు రోజుల్లో జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ సీహెచ్‌.ముకుందరావు తెలిపారు. మంగళవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో జరిగిన వాతావరణ ఆధారిత వ్యవసాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 33.1 నుంచి 34.2 డిగ్రీలు, కనిష్ఠంగా 25.8 నుంచి 26 డిగ్రీల వరకు నమోదు అవుతాయన్నారు.

రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

  • వరిలో కలుపు బెడదను నివారించుకోవాలి

  • అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ ముకుందరావు

అనకాపల్లిఅగ్రికల్చర్‌, సెప్టెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): రాగల ఐదు రోజుల్లో జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ సీహెచ్‌.ముకుందరావు తెలిపారు. మంగళవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌లో జరిగిన వాతావరణ ఆధారిత వ్యవసాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 33.1 నుంచి 34.2 డిగ్రీలు, కనిష్ఠంగా 25.8 నుంచి 26 డిగ్రీల వరకు నమోదు అవుతాయన్నారు. వర్షాల కారణంగా వరి పొలాల్లో కలుపు సమస్య పెరిగే అవకాశం వుందని, దీని నివారణకు 30 రోజుల క్రితం నాట్లు వేసిన లేదా నేరుగా విత్తిన పొలంలో ఎకరాకు ఎనిమిది గ్రాముల మెట్‌సల్ఫ్యూరాన్‌ మిథైల్‌ పదిశాతం, క్లోరరిమ్యురాన్‌ ఇథైల్‌ పది శాతం మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు. దుబ్బు చేసే దశలో ఉన్న వరి పైరుకు 25 కిలోల యూరియాను బురద పదునులో చల్లాలని సూచించారు. వరిలో పొడ తెగులు నివారణకు హెక్సాకోనజోల్‌ మందును లీటరు నీటికి రెండు మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. కాండం తొలుచు, ఆకుమడత పురుగులు ఆశిస్తే కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 4జీ గుళికలను ఎకరాకు ఎనిమిది కిలోల చొప్పున పొలంలో చల్లుకోవాలని చెప్పారు. 40 నుంచి 50 రోజుల వయసుగల వెదవరి పైరుకు పైపాటుగా ఎకరాకు 25 కిలోల యూరియా వేసుకోవాలన్నారు.

రాగి (చోడి) పైరులో అగ్గితెగులు నివారణకు కార్బండిజమ్‌ మందు లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయాలని ఏడీఆర్‌ సూచించారు. కంది పైరును ఎండుతెగులు ఆశిస్తే.. కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ మందును లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి మొక్కల మొదళ్లు తడిసేలా పిచికారీ చేయాలన్నారు. చెరకు పైరులో మొవ్వకుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్‌ లేదా మూడు గ్రాముల మాంకోజెట్‌ను కలిపి పిచికారీ చేయాలని చెప్పారు.వర్షాధార చెరకు తోటల్లో తీగజాతి కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉన్నట్టయితే క్లోరిమ్యురాన్‌ ఇథైల్‌/ మెట్‌సెల్ఫ్యురాన్మిథైల్‌ మందును ఎకరాకు ఎనిమిది గ్రాముల చొప్పున 200 లీట్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని ఏడీఆర్‌ ముకుందరావు చెప్పారు. ఈ సమావేశంలో డాక్టర్‌ కేవీరమణమూర్తి, డాక్టర్‌ డి.ఆదిలక్ష్మి, డాక్టర్‌ వి.గౌరి, డాక్టర్‌ ఆర్‌.సరిత, డాక్టర్‌ సిహెచ్‌.రామలక్ష్మి, డాక్టర్‌ వి.చంద్ర పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 09:59 AM