Share News

జీవనం భారమై, పిల్లలకు దూరమై...

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:10 AM

నగర పరిధిలోని ఎంవీపీ కాలనీ వాసి (73) ఒకరు ప్రభుత్వ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు.

జీవనం భారమై, పిల్లలకు దూరమై...

  • అందరూ ఉండి అనాథలుగా వృద్ధులు

  • ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులతో సతమతం

  • గుప్పెడు మెతుకులు, ప్రేమ పూర్వక మాట కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి

  • పట్టించుకోని చాలామంది పిల్లలు

  • ఆస్తులు పంచుకుని, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు చేరుస్తున్న వైనం...

  • విద్యావంతుల్లోనే అధికం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పరిధిలోని ఎంవీపీ కాలనీ వాసి (73) ఒకరు ప్రభుత్వ శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. రిటైర్‌మెంట్‌ సమయంలో వచ్చిన డబ్బును పిల్లలిద్దరికీ సమానంగా పంచారు. ఆ తరువాత ఆయన కొన్నాళ్లపాటు మరోచోట పనిచేశారు. పదేళ్ల కిందట ఆయన భార్య కన్నుమూశారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు. ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదని నగరంలోనే నివాసం ఉంటున్న పిల్లలకు సమాచారం ఇస్తే బిజీగా ఉన్నామంటూ సమాధానం వచ్చింది. దీంతో స్నేహితుడి సహకారంతో ఆయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.

గాజువాక ప్రాంత వాసి (ప్రస్తుతం 68 ఏళ్లు)కి ముగ్గురు పిల్లలు. ముగ్గురినీ బాగా చదివించారు. ఆస్తి,పాస్తులు కూడా బాగానే ఇచ్చారు. వృద్ధాప్యంలో భార్యను కోల్పోయిన ఆయన్ను...పిల్లలు ఎవరూ చేరదీయలేదు. ఒంటరితనంతో ఇబ్బందులు పడలేక ఆయన బంధువుల సహాయంతో వృద్ధాశ్రమంలో చేరిపోయారు.

...ఇటీవల ఈ తరహా ఉదంతాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బయటకు వస్తున్నవి కొన్ని మాత్రమే. రానివి ఎన్నో ఉంటున్నాయి. పిల్లల కోసం జీవితాలను త్యాగం చేసిన తమను చివరి దశలో వారు నిర్లక్ష్యం చేయడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. క్షణమొక యుగంలా గడుపుతూ తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారు. పిల్లల ప్రైవసీకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ముందు నుంచీ తల్లిదండ్రులు దూరంగా ఉంటుంటారు. అదే వారిపాలిట శాపంగా మారుతోంది. వయసు పైబడి, అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నా పిల్లలు పట్టించుకోవడం లేదు.

వృద్ధాశ్రమాలకు తాకిడి..

ఎవరూ లేని వారి కంటే అందరూ ఉండి కూడా అనాథలుగా మారుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో వృద్ధాశ్రమాల్లో ఉండే వారి సంఖ్య తక్కువగా ఉండేది. ఇప్పుడు పెరుగుతోంది. ప్రేమ సమాజంతోపాటు జిల్లాలో అనేక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాల్లో వందలాది మంది ఉంటున్నారు. వారిలో ఎవరిని కదిలించినా...అందరూ ఉన్న అనాథలం తామంటూ కన్నీటి పర్యంతమయ్యేవారు ఎందరో ఉన్నారు. బిడ్డల కోసం రెక్కలు కష్టం చేసిన ఎంతోమంది...చివరి దశలో గుప్పెడు మెతుకులు కోసం, ప్రేమ పూర్వక పిలుపు కోసం ఆశగా ఎదురుచూడాల్సిన స్థితిలో ఉన్నారు.

విద్యావంతుల్లోనే అధికం

తల్లిదండ్రులను దూరం పెడుతున్న వారిలో విద్యావంతులు, ఉన్నత కుటుంబాలకు చెందినవారే ఎక్కువగా ఉండడం గమనార్హం. వయసు పైబడిన తల్లిదండ్రులను చూసుకోవడం ఇబ్బందిగా భావించడమే కాదు. ..వారితో మాట్లాడేందుకు కూడా కొందరు ఇష్టపడడం లేదు. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి ఒకరు గడిచిన రెండేళ్లుగా కుమార్తె ఇంట్లో ఉంటున్నారు. సమయానికి భోజనం పెట్టామా?, లేదా?..అన్నట్టు మాత్రమే కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ప్రేమగా మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో వారికి ఇబ్బందిగా ఉండకూడదని భావించిన ఆయన ఇంట్లో చెప్పకుండానే కొద్దిరోజుల కిందట వృద్ధాశ్రమంలో చేరిపోయారు. ప్రేమ లేని చోట కడుపు నింపుకోవడానికి మాత్రమే ఎందుకు ఉండాలన్న ఉద్దేశంతోనే ఆశ్రమానికి వచ్చేశానంటూ తన స్నేహితుడికి చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. మరికొందరు పిల్లలు...తల్లిదండ్రులకు ఒక ఆయాను ఏర్పాటుచేసి ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా వచ్చి చూసి వెళుతున్నారు. ఇటువంటి వాళ్లు నగర పరిధిలోని అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ‘మా ఇంటికి వస్తే మీకే ఇబ్బందిగా ఉంటుంది...ఇక్కడే ఉండండి’ అంటూ చెప్పి వెళ్లిపోతుంటారని హెచ్‌బీ కాలనీకి చెందిన 73 ఏళ్ల వృద్ధుడు పేర్కొన్నాడు.

బయటకు రాకూడదని..

వృద్ధాప్యంలో ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కానీ, బయటకు రానివ్వరు. పిల్లల పరువు పోకూడదన్న ఉద్దేశంతో వృద్ధాశ్రమాల్లో చేరుతున్నవాళ్లు కూడా వారి కుటుంబ సభ్యులు విషయాలను బయట వారికి చెప్పేందుకు ఇష్టపడరు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చినా..వారి గురించి ఎవరికీ చెప్పవద్దంటూ కోరుతుంటారు. తమ వల్ల పిల్లలకు చెడ్డపేరు రాకూడదని కోరుకుంటుంటారు.

పిల్లలు చేరదీయకపోవడంతో మానసిక వేదన

- డాక్టర్‌ ముత్యాల బాలాజీ, సైకాలజిస్ట్‌

వృద్ధాప్యంలో పిల్లలు దూరంగా పెట్టడం వల్ల తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తుంటారు. కష్టపడి చదివించి, ప్రయోజకులను చేస్తే ఇప్పుడు పట్టించుకోవడం లేదని బాధపడుతుంటారు. మానసికంగా కుంగిపోతున్నామని, నిద్ర కూడా పట్టడం లేదంటూ నెలకు ముగ్గురు, నలుగురు వస్తుంటారు. తాము ఒంటరి అయిపోయామన్న బాధ, భావన వారిలో అధికంగా ఉంటోంది. ఆ బాధ తగ్గేందుకు కౌన్సెలింగ్‌ ఇస్తుంటాం. పిల్లలు తమకు దగ్గరిలో ఉన్నా పట్టించుకోరని కొందరు వాపోతుంటారు. పిల్లల ప్రేమ పూర్వకమైన మాట వారిని మానసిక సమస్యలు, నిద్ర లేమి ఇబ్బందుల నుంచి బయటపడేలా చేస్తుంది. కానీ, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పడుతున్న బాధలు పిల్లలకు పట్టడం లేదు. కనీసం వారి గురించి ఆలోచించే తీరిక కూడా ఉండడం లేదు. కొందరు తల్లిదండ్రులకు కావాల్సిన డబ్బులు, సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ, అవి వారికి మానసిక ఆనందాన్ని కలిగించేందుకు దోహదం చేయడం లేదు. అన్నీ ఉన్నా కుటుంబం లేదన్న భావన ఆ వయసులో వారిని తీవ్రంగా వేధిస్తుంది.

Updated Date - Mar 16 , 2025 | 01:10 AM