గ్రంథాలయాలు నిర్వీర్యం
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:31 AM
ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రంథాలయాలకు సిబ్బంది కొరత తీవ్రంగా వుంది. మొత్తం పోస్టుల్లో 2/3 వంతు ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. దీనివల్ల గ్రంథాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధిక శాతం గ్రంథాలయాలు ఇన్‌చార్జిలతో నడుస్తున్నాయి. గ్రేడ్-1 గ్రంథాలయాల్లో కూడా అటెండర్లు, స్వీపర్లు నియామకాలు చేపట్టకపోవడంతో అన్ని పనులు గ్రంథాలయ అధికారే చేయాల్సి వస్తున్నది. ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది స్థానంలో కొత్త నియామకాలు చేపట్టక పోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ఉమ్మడి జిల్లాలో 2/3 వంతు పోస్టులు ఖాళీ
మొత్తం పోస్టులు 132.. ప్రస్తుతం ఉన్నది 44 మంది మాత్రమే!
అధిక శాతం గ్రంథాలయాలకు ఇన్‌చార్జిలే దిక్కు
నర్సీపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రంథాలయాలకు సిబ్బంది కొరత తీవ్రంగా వుంది. మొత్తం పోస్టుల్లో 2/3 వంతు ఉద్యోగాలు ఖాళీగా వున్నాయి. దీనివల్ల గ్రంథాలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధిక శాతం గ్రంథాలయాలు ఇన్‌చార్జిలతో నడుస్తున్నాయి. గ్రేడ్-1 గ్రంథాలయాల్లో కూడా అటెండర్లు, స్వీపర్లు నియామకాలు చేపట్టకపోవడంతో అన్ని పనులు గ్రంథాలయ అధికారే చేయాల్సి వస్తున్నది. ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది స్థానంలో కొత్త నియామకాలు చేపట్టక పోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో గ్రేడ్-1 గ్రంథాలయాలు ఆరు, గ్రేడ్-2 గ్రంథాలయాలు ఏడు, గ్రేడ్-3 గ్రంథాయాలు 41, గ్రామీణ గ్రంథాలయాలు మూడు ఉన్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రంథాయాలు తెరిచివుంచాలి. గ్రేడ్-1 గ్రంథాలయాలు నర్సీపట్నం, చోడవరం, ఎలమంచిలి, అనకాపల్లి, భీమిలి, విశాఖపట్నం(డీసీఎల్)లో ఉండగా నర్సీపట్నం, విశాఖపట్నంలో మాత్రమే గ్రంథాలయ అధికారులు ఉన్నారు. మిగిలిన చోట్ల ఇన్‌చార్జిలతో నడుస్తున్నాయి. గ్రేడ్-2 గ్రంథాలయాల్లో ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్-3 గ్రంథాయాలు 41 ఉండగా వీటిల్లో 21 మంది మాత్రమే లైబ్రేరియన్లు ఉన్నారు. మిగిలిన 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రెండేసి గ్రంథాలయాలకు ఒక అధికారి పని చేయాల్సి వస్తున్నది. గొలుగొండ గ్రంథాలయ అధికారి ఎస్.వరలక్ష్మి ప్రతి బుధవారం నాతవరంలో విధులు నిర్వహిస్తున్నారు. రోలుగుంట గ్రంథాలయ అధికారి రాజుబాబు ప్రతి బుధవారం కొయ్యూరులో పనిచేస్తున్నారు. ఆర్.అప్పలనాయుడు మూడు రోజులు కోటవురట్ల, మరో మూడు రోజులు పాములవాకలో విధులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నం శాఖా గ్రంథాలయంలో అధికారి, అటెండరు, స్వీపర్ కమ్ వాచ్‌మన్ ఉండాలి. కానీ గ్రంథాలయ అధికారి మాత్రమే ఉన్నారు. దీంతో అన్ని రకాల పనులు గ్రంథాలయ అధికారి దమయంతి ఒక్కరే చూసుకోవాల్సి వస్తున్నది.
దిగువస్థాయి సిబ్బంది కొరత
ఉమ్మడి విశాఖ జిల్లాలో 132 పోస్టులకుగాను ప్రస్తుతం 44 మంది మాత్రమే వున్నారు. ఇంతకు రెట్టింపు.. అంటే 88 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో ఇద్దరికిగాను ఒక్కరే ఉన్నారు. టైపిస్టు పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. రికార్డు అసిస్టెంట్లు 17 మందికిగాను పది మంది వున్నారు. ఆఫీస్ సబార్డినేట్‌లు 38 మందికిగాను ఆరుగురే ఉన్నారు. వాచ్‌మన్ కమ్ స్వీపరు పోస్టులు 16కి ఇద్దరు మాత్రమే ఉన్నారు.