సమన్వయంతో పనిచేద్దాం
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:06 AM
కూటమిలో ఉన్న పార్టీలకు చెందిన వారందరం సమన్వయంతో పనిచేద్దామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు.
కూటమి ఎమ్మెల్యేలు, నేతలతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా సమావేశం
జిల్లాలో అమలు జరుగుతున్న పథకాలు, ప్రజల సమస్యల చర్చ
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఒక్క స్థానం కోల్పోవడంపై అసంతృప్తి
భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచన
జీవీఎంసీలో మలేరియా పోస్టులపై పలువురి ఫిర్యాదు
విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):
కూటమిలో ఉన్న పార్టీలకు చెందిన వారందరం సమన్వయంతో పనిచేద్దామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి సర్క్యూట్‌హౌస్‌లో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.గణబాబు, సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీఎ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, విశాఖ దక్షిణ టీడీపీ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్‌తో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో అమలు జరుగుతున్న పథకాలు, ప్రజల సమస్యలు, ఇటీవల జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఒక స్థానం కోల్పోవడంపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు కలిసి పనిచేస్తున్నారని, అదే మాదిరిగా జిల్లాలో కూటమి పార్టీలకు చెందిన అందరం ఎప్పటికప్పుడు సమావేశమై ప్రతి అంశంపై చర్చించుకుని, ముందుకు వెళదామన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎవరికైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతేతప్ప బహిరంగంగా ఎక్కడా వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఒక సీటు కోల్పోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. అన్ని సీట్లూ గెలుచుకునే బలం ఉన్నప్పుడు ఎందుకిలా జరిగిందని ప్రశ్నించారు. మేయర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మధ్య సమన్వయం ఉంటే ఇలా జరిగేది కాదని కొందరు అన్నప్పుడు మంత్రి జోక్యం చేసుకుని భవిష్యత్తులో అటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. జీవీఎంసీలో మలేరియా విభాగంలో కాంట్రాక్టు పోస్టులను వైసీపీ కార్పొరేటర్లు చెప్పిన వారికే ఇస్తున్నారని ఒకరిద్దరు ఫిర్యాదు చేయగా, మేయర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డీఆర్‌సీ సమావేశం త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు. దానికి ముందు జిల్లాలో కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.