టీడీపీని బలోపేతం చేద్దాం
ABN , Publish Date - Dec 26 , 2025 | 10:47 PM
తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేద్దామని ఆ పార్టీ అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు మోజోతి తేజోవతి అన్నారు.
క్షేత్ర స్థాయికి అభివృద్ధి, పథకాలు తీసుకెళ్లాలి
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపు
ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలి
టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజోతి తేజోవతి
పాడేరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):తెలుగుదేశం పార్టీని మరింతగా బలోపేతం చేద్దామని ఆ పార్టీ అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షురాలు మోజోతి తేజోవతి అన్నారు. శుక్రవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భవిష్యత్తులో అరకులోయ ఎంపీతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకునేలా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషిచేయాలన్నారు. అలాగే కూటమి పాలనలో గిరిజనులకు అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. గతంలో నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన గిరిజన ప్రాంతాలు కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయన్నారు. గిరిజనులకు జరుగుతున్న మేలుపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు పార్టీ క్యాడర్ వివరించాలన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలని ఆ పార్టీ అరకులోయ పార్లమెంట్ అధ్యక్షురాలు మోజోతి తేజోవతి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను పునాదులుగా చేసుకుని స్థానిక సంస్థల్లో ఆశించిన స్థాయిలో విజయాలు సాధించాలన్నారు. ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు బాటలు వేయాలని ఆమె సూచించారు. అలాగే నియోజకవర్గంలో పార్టీని నడిపించడంలో, నేతలు, కార్యకర్తలను సమన్వయం చేయడంలో పార్టీ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ముందున్నారని అభినందించారు. అంతకు ముందు ఆమె మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలిసి స్థానిక మోదకొండమ్మను దర్శించుకున్నారు. తొలిసారిగా ఇక్కడికి వచ్చిన తోజోవతికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ఏఎంసీ పర్సన్ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, టీడీపీ అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, సీనియర్ నేతలు చల్లంగి లక్ష్మణరావు, దన్నేటి పలాసి సురేశ్‌కుమార్, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.