కాఫీ ట్రయల్ అందాలను చూసొద్దాం
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:28 PM
అరకు నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎఫ్‌డీసీ) కాఫీ తోటల్లో ఏర్పాటు చేసిన కాఫీ ట్రయల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రత్యేక ఆకర్షణగా కెనోపివాక్
కాఫీ తోటల మధ్యలో ఉడెన్ బ్రిడ్జిపై నడవడం మరపురాని అనుభూతి
ట్రీ డెక్, బర్డ్ నెస్ట్, ఉడెన్ వ్యూ పాయింట్లు ఏర్పాటు
పెరుగుతున్న పర్యాటకుల ఆదరణ
అరకులోయ, జూన్ 3(ఆంధ్రజ్యోతి): అరకు నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎఫ్‌డీసీ) కాఫీ తోటల్లో ఏర్పాటు చేసిన కాఫీ ట్రయల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అరకు అందాలను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఇక్కడ మధురానుభూతి కలిగిస్తుంది. కాఫీ తోటల మధ్యలో అర కిలోమీటరు పొడవున ఏర్పాటు చేసిన కెనోపివాక్ (ఉడెన్ బ్రిడ్జి) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కెనోపివాక్‌పై నడుస్తూ కాఫీ తోటలు, సిల్వర్ ఓక్ చెట్లపై అల్లుకున్న మిరియాల పాదులను చూసి సందర్శకులు పరవశించిపోతున్నారు. అలాగే రెండు, మూడు చోట్ల ఏర్పాటు చేసిన ట్రీ డెక్‌లు, బర్డ్ నెస్ట్‌లు, ఉడెన్ వ్యూపాయింట్లు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి. మంచు కురిసే సమయంలో కాఫీ ట్రయల్‌లో ప్రకృతి అందాలు కనువిందు చేస్తుండడంతో పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. శనివారం, ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. టికెట్ల రూపంలో ఎపీఎఫ్‌డీసీకి మంచి ఆదాయం వస్తోంది. ఈ కాఫీ ట్రయల్‌లో వెడ్డింగ్ షూట్, సీరియల్స్, రీల్స్ షూటింగ్‌లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వెడ్డింగ్ షూట్‌లకు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. కాఫీ ట్రయల్‌లో ప్రవేశానికి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.20, బర్డ్ నెస్ట్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాఫీ ట్రయల్‌ను సందర్శించేందుకు అవకాశం కల్పించారు.