Share News

సన్నాల వైపు సాగుదాం

ABN , Publish Date - Jul 03 , 2025 | 12:39 AM

జిల్లాలో చాలా కాలంగా సాగులో ఉన్న శ్రీకాకుళం సన్నాలు (ఆర్‌జీఎల్‌ 2537) రైతుల మన్ననలను పొందుతూ అధిక శాతం విస్తీర్ణంలో సాగవుతోంది. కాగా విజేత, కాటన్‌ దొర సన్నాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది.

సన్నాల వైపు సాగుదాం
శ్రీకాకాళం సన్నాలు

జిల్లాకు అనువైన వరి రకాలు

అధిక విస్తీర్ణంలో శ్రీకాకుళం సన్నాలు సాగు

ధాన్యం సేకరణలో ప్రభుత్వం సన్న బియ్యం రకాలకే ప్రోత్సాహం

వరి రకాల ఎంపికలో పెరిగిన ప్రాధాన్యం

అనకాపల్లి అగ్రికల్చర్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చాలా కాలంగా సాగులో ఉన్న శ్రీకాకుళం సన్నాలు (ఆర్‌జీఎల్‌ 2537) రైతుల మన్ననలను పొందుతూ అధిక శాతం విస్తీర్ణంలో సాగవుతోంది. కాగా విజేత, కాటన్‌ దొర సన్నాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ ఉన్న సన్న బియ్యం వరి రకాలనే పండించాలని, ఈ రకం విత్తనాలకే రాయితీ ఇస్తామని, ధాన్యం సేకరణలో ప్రాధాన్యం ఇస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో వరి రకాల ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

జిల్లా తుఫాన్‌ ప్రభావిత ప్రాంతం కనుక గాలులను తట్టుకొని నేల వాలకుండా నిలిచే శక్తి ఉన్నందున, నీటి ఎద్దడి, ముంపు పరిస్థితులను తట్టుకునే రకం అయినందున శ్రీకాకుళం సన్నాలనే రైతులు అధికంగా పండిస్తున్నారు. 160 రోజులకు ఇది కోతకు వస్తుంది. కోతకు ముందు మూడు, నాలుగు రోజులు పొలంలో నీరున్నా తట్టుకోగలదు. రబీలో కూడా దీనిని విస్తారంగా సాగు చేస్తున్నారు. ముదురు నారు ఊడ్పులకు ఇది అత్యుత్తమం. 60 రోజుల నారు నాటుకున్నా దిగుబడి పెద్దగా ప్రభావితం కావడం లేదు. మంచి బియ్యం నాణ్యతతో పాటు డిసెంబర్‌ మొదటి వారంలో కోతకు రావడం వలన రైతులు దీనిపైనే మొగ్గు చూపుతున్నారు. ఎకరాకు 30 నుంచి 35 బస్తాల(హెక్టారుకు 56.5 క్వింటాళ్లు) దిగుబడి వస్తుంది. సాగు ఖర్చు ఎకరాకు 40 వేల రూపాయలు అయితే స్థూల ఆదాయం రూ.68 వేలు వస్తుంది. అయితే దీనికి ఇన్ని సుగుణాలున్నా ఇది పదేళ్లకు పైబడి సాగులో ఉన్న రకమైనందున ఇది జన్యుపరంగా బలహీనపడుతుందని, దిగుబడులు, ఇతర విశిష్టతలు గతంలో మాదిరి ఉండవు కనుక దీనికి బదులు కొత్త రకాలలో ఈ ప్రాంతానికి అనువైన రకాలను ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ఎంటీయూ 1121(శ్రీధృతి): జిల్లాలో ఈ రకం వరి విస్తీర్ణం ఇటీవల కాలంలో త్వరగా పెరుగుతోంది. 130 నుంచి 140 రోజుల్లో కోతకు వస్తుంది. ఖరీఫ్‌, రబీలకు అనువైనది. ఇది కూడా గాలులకు అంత త్వరగా నేలవాలదు. ఎకరాకు 24 నుంచి 28 క్వింటాళ్ల (75 కిలోల బస్తాలు ఎకరాకు 50 నుంచి 55 వరకు) దిగుబడినిస్తుంది. ఎకరాకు రూ.35 వేల సాగు ఖర్చు కాగా, స్థూల ఆదాయం రూ.85 వేల వరకు ఉంటుంది. బ్యాక్టీరియల్‌, ఆకు తెగులు, కాండం కుళ్లు తెగులు నుంచి కాపాడుకోవాలి.

ఎంటీయూ 1224: 140 నుంచి 145 రోజులలో కోతకు వచ్చే ఈ రకం (మార్టేరు సాంబ) అగ్గితెగులు వంటి తెగుళ్లను తట్టుకుంటుంది. బియ్యం నాణ్యత బాగుంటుంది. కనుక సన్నబియ్యంగా మంచి ధరే పలుకుతుంది. సాంబ మసూరికి బదులుగా ఇది వ్యాప్తిలోకి వస్తుంది. ఖరీఫ్‌, రబీలలో వేసుకోవచ్చు. ఎకరాకు 26 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది.

ఎంటీయూ 1262: దీని మంచి నాణ్యమైన బియ్యం దిగుబడి ఇటు రైతులను, అటు మిల్లర్లను ఆకర్షిస్తోంది. ఈ ఖరీఫ్‌ రకం వరి పంట కాలం 140 నుంచి 145 రోజులు. ఎకరాకు 40 నుంచి 60 బస్తాల (ఎకరాకు 40 నుంచి 60 క్వింటాళ్లు) దిగుబడి లభిస్తుంది.

ఎంటీయూ 1318: 150 నుంచి 155 రోజుల్లో కోతకు వస్తుంది. దోమపోటు, అగ్గితెగులు తట్టుకుంటుంది. ఖరీఫ్‌, రబీలకు అనువైనది. నాణ్యమైన సన్నబియ్యం రకంగా వ్యాప్తి చెందుతోంది. మంచి రేటు కూడా లభిస్తోంది. 45 రోజుల ముదురు నారును కూడా వేసుకోవచ్చు. గాలులను తట్టుకోగలదు. చేను తొందరగా పడిపోదు. స్వర్ణ వరికి ప్రత్యామ్నాయంగా వృద్ధి చెందుతోంది. ఎకరాకు 40 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుంది.

ఈ ప్రధాన రకాలతో పాటు ప్రైవేటు వరి రకాలు సంపత్‌ సోనా వంటివి కూడా బాగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రభుత్వం ఆర్‌వోఎల్‌ 2537, ఎంటీయూ 1121, 1061 ఇంద్ర, సాంబ, ఎంటీయూ 1262, ఎంటీయూ 1318 విత్తనాలను సరఫరా చేస్తున్నారు. రైతులు ప్రభుత్వం ధాన్యం సేకరణకు అనుమతించిన రకాలనే వేసుకోవడం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Updated Date - Jul 03 , 2025 | 12:39 AM