కదలం, విశాఖను వదలం
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:24 AM
ప్రభుత్వ శాఖల్లో బదిలీలు సర్వసాధారణం. నిబంధనల ప్రకారం ఒకచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులు బదిలీపై వెళ్లాల్సిందే.
బదిలీల నేపథ్యంలో పలువురు అధికారులు, ఉద్యోగులు మంకుపట్టు
కూటమి నేతలు, అమరావతి నుంచి ఉన్నతాధికారులతో జిల్లా అధికారులకు సిఫారసులు, ఫోన్లు
రెవెన్యూ సహా పంచాయతీ, జల వనరులు, ఖజానా శాఖల్లో అదే తీరు
మార్పులకు యంత్రాంగం ససేమిరా
విశాఖపట్నం, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ శాఖల్లో బదిలీలు సర్వసాధారణం. నిబంధనల ప్రకారం ఒకచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులు బదిలీపై వెళ్లాల్సిందే. అయితే విశాఖలో పనిచేస్తున్న పలు శాఖల ఉద్యోగులు ఇక్కడ నుంచి కదిలేందుకు ఇష్టపడం లేదు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వెళ్లడానికి సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఉన్నతాధికారు లపై పలు రకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా నగరంలో ఉండడానికే మొగ్గుచూపుతున్నారు. ఇందుకు అధికార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరు అమరావతి స్థాయిలో ఉన్నతాధికారులతో ఫోన్లు చేయిస్తున్నారు.
బదిలీల కోసం సిఫారసు లేఖలు సమర్పించినా జిల్లా ఉన్నతాధికారులు ఐదేళ్ల సర్వీస్ నిబంధనను అనుసరించి పలువురు ఉద్యోగులను పొరుగు జిల్లాలకు పంపేశారు. ఈ విధంగా రెవెన్యూలో భారీగానే బదిలీలు అయ్యాయి. అయితే కొందరు...తహశీల్దారు నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకూ విశాఖ నుంచి బయటకు వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లకు ఫోన్‌లు చేయిస్తున్నారు.
నగరంలో ఒక సీనియర్ అసిస్టెంట్‌ను ఇక్కడే మరో విభాగానికి పంపారు. సదరు ఉద్యోగి పౌరసరఫరాల శాఖలో సీనియర్ చెకింగ్ ఇన్‌స్పెక్టర్‌గా పోస్టింగ్ కావాలని రాష్ట్రంలో అత్యంత కీలకమైన వ్యక్తి ద్వారా ఒత్తిడి తీసుకురాగా యంత్రాంగం సున్నితంగా తిరస్కరించింది.
సివిల్ సరఫరాలో పనిచేస్తున్న ఉద్యోగికి రెవెన్యూలో కీలక మండలాంలో పోస్టింగ్ ఇస్తే అక్కడకు వెళ్లేదిలేదంటూ చెప్పడం రెవెన్యూ ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు పనిచేయాలే తప్ప ...ఇలా ఒత్తిడి తీసుకురావడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బదిలీలకు సంబంధించి వస్తున్న ఒత్తిళ్లపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీలు చేపట్టామని, దీనికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆయా చోట్ల విధుల్లో చేరాలే తప్ప మార్పులు చేర్పులకు తావులేదని స్పష్టంచేస్తోంది.
భూపరిపాలనా ముఖ్య కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన గాజువాక తహశీల్దారు తోట శ్రీవల్లిని వీఎంఆర్‌డీఏకు, సీతమ్మధార తహశీల్దారు రమేష్‌ను ములగాడ తహశీల్దారుగా బదిలీ చేశారు. అయితే ఇరువురు ఆయా చోట్ల పనిచేయడానికి ఇష్టపడడం లేదని తెలిసింది. తిరిగి సీసీఎల్‌ఏకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. కాగా బదిలీ అయిన తహశీల్దార్లు, ఉద్యోగులు వెంటనే రిలీవ్ కావాలని జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు పెందుర్తి, ములగాడ తహశీల్దార్లు అక్కడ డీటీలకు బాధ్యతలు అప్పగించారు. మరో 30 మంది ఉద్యోగులు రిలీవ్ కాగా మిగిలినవారు కూడా ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు అప్పగించాలని యంత్రాంగం ఆదేశించింది.
జిల్లా పంచాయతీశాఖకు సంబంఽధించి ఉమ్మడి జిల్లా పరిధిలో మండల విస్తరణాధికారి నుంచి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శి వరకూ 230 మందిని బదిలీ చేశారు. అయితే వీరిలో చాలామంది విశాఖ జిల్లాలోనే పనిచేస్తామని సిఫారసు లేఖలు తెచ్చుకున్నారు. కొందరైతే ఆనందపురం, పెందుర్తి మండలాల్లో పంచాయతీ కార్యదర్శులగా నియమించాలని ఒత్తిడి తెచ్చారు. జల వనరుల శాఖలో ఇదే పరిస్థితి కొనసాగింది. ఒక సీనియర్ అసిస్టెంట్‌ను నగరం నుంచి విజయనగరానికి బదిలీ చేస్తే ఇక్కడ కొనసాగించాలని ఒత్తిడి తెచ్చారు. చోడవరం ప్రాంతం నుంచి ఎలమంచిలికి బదిలీ అయిన ఉద్యోగి కూడా విశాఖ కోసం పట్టుబట్టారు. ఇదిలావుండగా జిల్లా ఖజానా కార్యాలయంలో పలువురు ఉద్యోగులు పలు కారణాలతో విశాఖలోనే ఉండిపోయారు. అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు వెళ్లకుండా ఉన్నత స్థాయిలో పైరవీ చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. నగరంలో కీలక పోస్టుల్లో పనిచేసి రెండేళ్ల క్రితం అనకాపల్లి జిల్లాకు వెళ్లి భారీగా అక్రమాలకు పాల్పడిన సీఐను ఇటీవల రేంజ్‌కు సరండర్ చేశారు. ప్రస్తుతం ఆయన సిటీలో పోస్టింగ్ కావాలంటూ అధికార పార్టీ కీలక నేత ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారు.