Share News

వీడని ‘మొంథా’ ఛాయలు!

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:59 AM

‘మొంథా’ తుఫాన్‌ తీరందాటి రెండు రోజులైనప్పటికీ జిల్లాలో దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే వుంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాలులు సైతం బలంగా వీచాయి.

వీడని ‘మొంథా’ ఛాయలు!
అనకాపల్లి ఆవఖండం ప్రాంతంలో చెరువును తలపిస్తున్న వరి పొలాలు

పలుచోట్ల భారీ వర్షం

రోజంతా ముసురు, చిరు జల్లులు

జలాశయాలు, నదుల్లో కొనసాగుతున్న వరద

1,381 హెక్టార్లలో వరి నీట మునిగినట్టు ప్రాథమిక అంచనా

367 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసం

పంచాయతీరాజ్‌ శాఖకూ తీవ్ర నష్టం

అనకాపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘మొంథా’ తుఫాన్‌ తీరందాటి రెండు రోజులైనప్పటికీ జిల్లాలో దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే వుంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. గాలులు సైతం బలంగా వీచాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడక్కడా జల్లులు పడ్డాయి. మరోవైపు జలాశయాల్లోకి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో అధికారులు గేట్లు ఎత్తి నదుల్లోకి నీటిని విడిచిపెడుతున్నారు. దీంతో నదులు, వాగుల్లో వరద ఉధృతి తగ్గలేదు. లోతట్టు ప్రాంతాల్లోని పంట భూములు ఇంకా ముంపులోనే వున్నాయి. వీలున్నచోట పొలాల్లో నుంచి నీటిని బయటకు పంపడానికి రైతులు ప్రయత్నిస్తున్నారు. కాగా 78 పునరావాస కేంద్రాలు గురువారం కూడా కొనసాగాయి. వీటిల్లో 985 మందికి అల్పాహారం, భోజన సదుపాయం కల్పించారు.

పంటనష్టం అంచనాలో వ్యవసాయ శాఖ

వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అధికారుల ప్రాథమిక అంచనా మేరకు గురువారం సాయంత్రానికి 1,381 హెక్టార్లలో వరి పంట నీటమునిగింది. కానీ మండలాల నుంచి వస్తున్న సమాచారాన్నిబట్టి ఇది మరింత ఎక్కువ వుండే అవకాశం వుంది. అనకాపల్లి మండలంలో అత్యధికంగా 570 హెక్టారుల్లో వరి పంట నీట మునిగింది. బుచ్చెయ్యపేట మండలంలో 93 హెక్టార్లు, చోడవరంలో 84, సబ్బవరంలో 54, కశింకోటలో 65, మునగపాకలో 79, దేవరాపల్లిలో 24, కె.కోటపాడులో 49, చీడికాడలో 8, గొలుగొండలో 14, నర్సీపట్నంలో 21, నాతవరంలో 10, అచ్యుతాపురంలో 4, మాడుగులలో 2, కోటవురట్లలో 2, రాంబిల్లిలో 78, పరవాడలో 6, రావికమతంలో 7, ఎలమంచిలిలో 35 హెక్టార్లలో వరి నీట మునిగింది. బొప్పాయి 6 హెక్టార్లు, అరటి 9.6, కూరగాయలు 10.2 హెక్టార్లలో దెబ్బతిన్నది.

ధ్వంసమైన రోడ్లు

భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల రహదారులు ధ్వంసమయ్యాయి. ఆర్‌అండ్‌బీకి చెందిన 366.92 కిలోమీటర్ల పొడవుగల రోడ్లు 79 చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. అనకాపల్లి, చోడవరం, సబ్బవరం, బుచ్చెయ్యపేట, ఎలమంచిలి, పరవాడ, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, కె.కోటపాడు, నర్సీపట్నం, చీడికాడ, మునగపాక, కశింకోట, నాతవరం, అచ్యుతాపురం మండలాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. 13 కల్వర్టులు ధ్వంసం అయ్యాయి. వీటి మరమ్మతులకు ఎంతమేర నిధులు అవసరమో ఇంజనీరింగ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:59 AM