Share News

ఉన్నవి వదిలేసి, బయట కొనుగోలు చేసి...!

ABN , Publish Date - Jun 08 , 2025 | 01:03 AM

కేజీహెచ్‌లో ఆరు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉన్నాయి.

ఉన్నవి వదిలేసి, బయట కొనుగోలు చేసి...!

  • ఇదీ కేజీహెచ్‌ ఉన్నతాధికారుల నిర్వాకం

  • ఆస్పత్రిలో ఆరు ఆక్సిజన్‌ ప్లాంట్లు

  • కొవిడ్‌ సమయంలో రూ.5.22 కోట్లతో ఏర్పాటు

  • వాటిని వినియోగించుకోకుండా, బయట కొనుగోలు చేస్తున్న వైనం

  • నెలకు రూ.30 లక్షల వరకూ వ్యయం

  • సమర్థించుకునేందుకు అంతా క్వాలిటీ ఉండదంటూ అడ్డగోలు వాదన

విశాఖపట్నం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లో ఆరు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఉన్నాయి. అయితే అధికారులు వాటిని ఉపయోగించుకోకుండా, బయట ప్రైవేటు సంస్థల నుంచి ఆక్సిజన్‌ కొనుగోలు చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా తొలి, మలి దశల్లో ఆక్సిజన్‌ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రుల్లో గాలి ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటుచేశాయి. ఈ క్రమంలోనే కేజీహెచ్‌లో కూడా ఆరు ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఒక్కొక్క దానికి రూ.87 లక్షల చొప్పున ఆరింటికి రూ.5.22 కోట్లు వెచ్చించారు. ఒక్కో యూనిట్‌లో నిమిషానికి వేయి లీటర్లు ఆక్సిజన్‌ తయారుచేసే సామర్థ్యం కలిగిన యంత్రాలను ఏర్పాటుచేశారు. అయితే వైరస్‌ తగ్గుముఖం పట్టిన తరువాత వాటిని ఆస్పత్రి అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు.

కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లకు రెగ్యులర్‌గా ఆక్సిజన్‌ అవసరమవుతుంది. అందుకోసం ప్రైవేటు సంస్థ నుంచి ఆక్సిజన్‌ కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ప్రతినెలా ఆస్పత్రి అధికారులు రూ.30 లక్షలకుపైగానే వెచ్చిస్తున్నారు. ఆస్పత్రిలో 20 కిలోలీటర్లు, 13 కిలోలీటర్లు సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకర్లు ఉన్నాయి. ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఆక్సిజన్‌ను ఆ ట్యాంకుల్లో స్టోర్‌ చేసి వార్డులకు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్‌ ఆక్సిజన్‌ సరఫరా సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. అయితే ఆస్పత్రిలో గల ప్లాంట్ల ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తే రోగుల అవసరాలు తీరేందుకు అవకాశం ఉంది. అయితే, అధికారులు మాత్రం వాటిని నిర్లక్ష్యం చేసి బయట నుంచి కొనుగోలు చేయడం విశేషం. ఒక్క కేజీహెచ్‌లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వాస్పత్రుల్లో ఇదే విధానాన్ని అనుసరిస్తుండడం గమనార్హం. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

అధికారుల వాదన ఇదీ..

ప్రస్తుతం గాలి ద్వారా ఆక్సిజన్‌ తయారుచేయాలంటే భారీగా ఖర్చవుతుందని, అందులో కూడా ప్యూరిటీ తక్కువగా ఉంటుందని కేజీహెచ్‌ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్యూరిటీ తక్కువగా ఉంటే కొవిడ్‌ రోగులకు ఎలా అందించారన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఆ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను రోగుల అవసరాలకు వినియోగించు కోవచ్చునని, కొన్నిరకాల వ్యాధులతో బాధపడే రోగులకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ కావాల్సి వస్తే బయట కొనుగోలు చేయవచ్చునని నిపుణులు సూచి స్తున్నారు. పూర్తిగా కొనుగోలు చేసిన లిక్విడ్‌ ఆక్సిజన్‌పై ఆధారపడి, ఆస్పత్రిలో ఉన్న ప్లాంట్లను మూలకు చేర్చడం సమంజసం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. దీనిపై కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానందను వివరణ కోరగా...ఆక్సిజన్‌ ప్లాంట్లను వినియోగంలోకి తీసుకువచ్చే పనిలో ఉన్నట్టు చెప్పారు. ఆక్సిజన్‌ ప్లాంట్ల ద్వారా తయారు చేసే ఆక్సిజన్‌తో పోలిస్తే లిక్విడ్‌ ఆక్సిజన్‌ క్వాలిటీ బాగుంటుందన్నారు. దీనిపై చాలాకాలం స్టడీ చేసిన తరువాతే కొనుగోలు చేస్తున్నామని, అయినప్పటికీ ఆక్సిజన్‌ ప్లాంట్లను పూర్తిగా వినియోగంలోకి తీసుకు వస్తామన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 01:03 AM