డొంకరాయి పవర్ కెనాల్‌లో లీకేజీ
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:51 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే డొంకరాయి పవర్ కెనాల్‌కు లీకేజీ ఏర్పడడంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమై నీటి విడుదలను నిలిపివేశారు.
వెప్ వాల్స్ నుంచి బురద నీరు లీకులు
యుద్ధప్రాతిపదిక గ్రౌటింగ్ పనులు చేపట్టిన జెన్‌కో అధికారులు
పొల్లూరు, డొంకరాయిల్లో నిలిచిన విద్యుదుత్పత్తి
సీలేరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేసే డొంకరాయి పవర్ కెనాల్‌కు లీకేజీ ఏర్పడడంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమై నీటి విడుదలను నిలిపివేశారు. లీకేజీలను అరికట్టేందుకు గ్రౌటింగ్ పనులను చేపట్టారు. కెనాల్ నుంచి నీటి విడుదలను బంద్ చేయడంతో పొల్లూరు, డొంకరాయి జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. కెనాల్ లీకేజీలను జెన్‌కో పెట్రోలింగ్ సిబ్బంది గమనించడంతో కెనాల్‌కు పెను ప్రమాదం తప్పింది. లేదంటే 2022 మే 16వ తేదీన జరిగిన సంఘటన పునరావృతమై కెనాల్‌కు గండి పడి జెన్‌కోకు భారీ నష్టం వాటిల్లి ఉండేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీనిపై సీలేరు కాంప్లెక్సు జెన్‌కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావును వివరణ కోరగా.. డొంకరాయి పవర్ కెనాల్ రీచ్ వన్‌లో వెప్‌వాల్స్ నుంచి ఎర్రబురద, మట్టి వస్తుండడంతో కెనాల్ పెట్రోలింగ్ సిబ్బంది శనివారం రాత్రి గమనించి తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వెంటనే సీలేరు కాంప్లెక్సులోని ఇంజనీర్లు, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ఆదివారం ఉదయం నుంచి 24 గంటల పాటు ఎల్‌సీ తీసుకున్నామన్నారు. అలాగే కెనాల్‌కు నీటి విడుదల నిలిపివేశామన్నారు. లీకు అవుతున్న ప్రదేశంలో ఆదివారం ఉదయం నుంచి 50 బస్తాల సిమెంట్‌తో గ్రౌటింగ్ చేయిస్తున్నామన్నారు. రాత్రి 10 గంటల వరకు ఈ పనులు కొనసాగుతాయన్నారు. అలాగే కెనాల్‌కు అక్కడక్కడ ప్లాస్టింగ్ పోయిన ప్రాంతాల్లో ప్యాచ్‌వర్క్ చేయిస్తున్నామన్నారు. సోమవారం ఉదయం మరోసారి కెనాల్‌ను పరిశీలించి వెప్‌వాల్స్ వద్ద ఎర్రమట్టి బురద లీకు ఆగిపోతే విద్యుదుత్పత్తిని ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని జెన్‌కో సీఈ రాజారావు తెలిపారు.