Share News

నేతల మేత

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:27 AM

నగరంలో భవన నిర్మాణం ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. పెరిగిన నిర్మాణ వ్యయం సంగతి పక్కన పెడితే అనుమతుల పేరుతో వేధింపులు అధికమయ్యాయి.

నేతల మేత

ముడుపు చెల్లిస్తేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌

‘సార్‌తో ఓ మాట చెప్పించండి’...

అంటున్న నగర పాలక సంస్థ అధికారులు

గగ్గోలు పెడుతున్న భవన నిర్మాణదారులు

కొన్ని నియోజకవర్గాల్లో తెర వెనుక చక్రం తిప్పుతున్న నాయకులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో భవన నిర్మాణం ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. పెరిగిన నిర్మాణ వ్యయం సంగతి పక్కన పెడితే అనుమతుల పేరుతో వేధింపులు అధికమయ్యాయి. మొన్నటివరకు టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మాత్రమే చుక్కలు చూపించేది. ఇప్పుడు వారికి చాలామంది తోడయ్యారు. తోడేళ్లులా పీక్కు తింటున్నారు. ఇప్పుడు ఈ దందాకు నాయకులే వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నాయకులు ఇలాంటి ఇబ్బందులు సృష్టిస్తారని అసలు ఊహించలేదని భవన నిర్మాణదారులు వాపోతున్నారు.

వంద గజాలలోపు నిర్మాణాలకు ప్లాన్‌ అవసరం లేదని, ఇల్లు కట్టుకునే వారిని వేధించవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఇప్పుడు అంతకు మించి నిర్మాణాలు చేపట్టేవారిపై పడుతున్నారు. వార్డులో సచివాలయ సిబ్బంది నుంచి జోనల్‌ ఆఫీసులో అధికారి వరకూ భవన నిర్మాణాలపై ఆదాయం కోసం ఎగబడుతున్నారు. ప్లాన్‌కు ఒకంతట అనుమతి ఇవ్వడం లేదు. గడువు ముగిసిన తరువాత ‘డీమ్డ్‌ టు బి అప్రూవుడ్‌’గా భావించి నిర్మాణం చేపడితే దానిపై కొర్రీల మీద కొర్రీలు వేస్తున్నారు. భవన నిర్మాణాలే వృత్తిగా చేసుకున్న బిల్డర్లు ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చి పనులు పూర్తి చేసుకుంటున్నారు. అధికారులు, నాయకులకు ఇచ్చే లంచాలను కూడా వారు ఓ ఖర్చులా భావిస్తున్నారు. వీరు కాకుండా జీవితాంతం పొదుపు చేసి, వారసత్వంగా వచ్చిన భూమిలో కాసింత పెద్ద భవనం నిర్మించుకునేవారికే సమస్యలు ఎదురవుతున్నాయి. నిర్మాణానికి బోరు తవ్విన దగ్గర నుంచి ఫిర్యాదులు, బెదిరింపులు. టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి ఇవ్వాల్సింది ఇచ్చేసిన తరువాత...ప్రెస్‌ పేరుతో మరికొందరు. ఆ తరువాత స్థానిక కార్పొరేటర్‌ వాటా అంటూ కబురు...ఇలా అందరిని సంతృప్తి పరిచి నిర్మాణం పూర్తి చేసుకుని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ కోసం వెళితే..‘సార్‌’తో ఓ మాట చెప్పించండి’...అంటూ అధికారులు అసలు బాంబు పేలుస్తున్నారు. ఆ సార్‌ ఎవరో కాదు...నియోజకవర్గ నాయకుడే. వారి ఆఫీసుకు వెళ్లి, అక్కడి మనుషులను కలిస్తే నిర్మాణం స్థాయిని బట్టి ‘ముడుపు’ ఎంత చెల్లించుకోవాలో సెలవిస్తున్నారు. ఆ మొత్తం సమర్పించుకున్నాక జోనల్‌ ఆఫీస్‌కు వారి ముందే ఫోన్‌ చేసి...‘మనవాళ్లే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చేయండి’ అని చెబుతున్నారు. అప్పుడు గానీ ఆ కొత్త భవనంలోకి గృహప్రవేశం చేయడం కుదరడం లేదు. జీవీఎంసీ పరిధిలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను ఇదే పరిస్థితి ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల నియోజకవర్గ నాయకుడికి తెలియకుండా ద్వితీయ శ్రేణి నాయకులు ఈ దందా చేస్తుంటే...మరికొన్ని నియోజకవర్గాల్లో నాయకులే తమ వారితో ఈ కలెక్షన్లు చేయిస్తున్నారు. బాగా తెలిసిన నాయకులే ఇలా ఇబ్బంది పెడుతున్నారేమిటి?...అని వ్యాపార వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

Updated Date - Nov 01 , 2025 | 01:27 AM