‘ఉక్కు’లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:11 AM
విశాఖ స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు పరంపర కొనసాగుతోంది.
మరో 500 మందిని తొలగిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు
తీవ్ర ఆందోళనలో కార్మిక సంఘాలు
ఉక్కుటౌన్‌షిప్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
విశాఖ స్టీల్‌ప్లాంటులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు పరంపర కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ప్లాంటులో పనిచేస్తున్న సుమారు ఐదు వందల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ యాజమాన్యం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే దపదపాలుగా సుమారు 4,500 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఈ చర్యలను నిరసిస్తూ నిర్వాసిత సంఘాలు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నాయి. గతంలో తొలగించిన వారిలో ఎక్కువమంది కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు. దీంతో పాటు కొంతమంది కాంట్రాక్టర్ల టెండర్‌ల గడువు ముగియడంతో పునరుద్ధరించలేదు. దీంతో వారివద్ద పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు పని లేకుండా పోయింది. స్టీల్‌ప్లాంటులో ఇప్పటికే కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో ఉన్న వారిని కూడా తొలగిస్తుండడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హాజరు వివాదం
సాంకేతిక సమస్యకు ఎలా బాధ్యులం?
విద్యాశాఖ తీరుపై ఉపాధ్యాయ సంఘాల మండిపాటు
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
పాఠశాల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదుపై వివాదం తలెత్తింది. ఉపాధ్యాయుల సొంత సెల్‌ఫోన్‌లో సమావేశాలకు హాజరైనట్టు ‘ఇన్’, ‘అవుట్’ నమోదు చేసుకుంటారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు క్లస్టర్ల వారీగా సమావేశాలు ప్రారంభమై సాయంత్రం ఐదుగంటల వరకు సాగాయి. సమావేశాలకు హాజరైన ఉపాధ్యాయులు తొలుత హాజరు వేసుకున్నారు. సమావేశం ముగిసిన తరువాత బయటకు వెళ్లినట్టు మరోసారి నమోదుచేసుకునే క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వారు పలుమార్లు ప్రయత్నించి తరువాత పట్టించుకోలేదు. దీనిని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలుసుకుని జిల్లాల నుంచి సమాచారం కోరారు. ఈ నేపథ్యంలో క్లస్టర్ సమావేశాల నుంచి బయటకు వెళ్లే సమయాన్ని నమోదుచేయని ఉపాధ్యాయులు వివరణ ఇవ్వాలని మండల విద్యాశాఖాధికారులు ఆదేశించారు. దీంతో టీచర్లు అవాక్కయ్యారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం సాయంత్రం ఐదుగంటల సమయంలో టీచర్లంతా ఒకేసారి నమోదుకు ప్రయత్నించినపుడు సర్వర్ బిజీ కావడంతో సాంకేతిక సమస్య తలెత్తితే దానికి ఉపాధ్యాయులు ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. సాంకేతిక సమస్యతో సర్వర్ పనిచేయకపోతే పాఠశాల విద్యాశాఖ బాధ్యత వహించాలి తప్ప టీచర్లు కాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, టీఆర్.అంబేద్కర్ స్పష్టంచేశారు. సమావేశాలకు భౌతికంగా హాజరును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అయితే క్లస్టర్ సమావేశాలకు గురుకుల పాఠశాలల టీచర్లు హాజరుకాలేదని పలువురు చెబుతున్నారు. గురుకులాలు డీఈవో పరిధి కాకపోడంతో అక్కడ పనిచేసే టీచర్లు విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. క్లస్టర్ సమావేశాళక్ష్‌ళ ఉపాధ్యాయులకు అకడమిక్‌గా పునశ్చరణ తరగతులు నిర్వహిస్తారు. సబ్జెక్టు వారీగా రూపొందించిన వీడియోలు ప్రదర్శించి సందేహాలుంటే నివృత్తి చేయడానికి రిసోర్స్ పర్సన్లు ఉంటారు. అందువల్ల ప్రతి టీచర్ ఈ సమావేశాలకు రావాలని, కాని గురుకులాల టీచర్లు రాలేదన్నారు.