Share News

5న న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం

ABN , Publish Date - Sep 02 , 2025 | 12:26 AM

దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సంయుక్త స్నాతకోత్సవం (8 నుంచి 12 వరకు) ఈ నెల ఐదో తేదీ ఉదయం విశాఖపట్నంలోని హోటల్‌ నోవాటెల్‌లో జరుగుతుందని ఉప కులపతి ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశరావు తెలిపారు.

 5న న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్‌ఎన్‌ఎల్‌యూ ఉప కులపతి ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశరావు. పక్కన ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విశ్వచంద్రనాథ్‌

ముఖ్యఅతిథిగా హాజరు కానున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌

వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ సూర్యప్రకాశరావు వెల్లడి

సబ్బవరం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సంయుక్త స్నాతకోత్సవం (8 నుంచి 12 వరకు) ఈ నెల ఐదో తేదీ ఉదయం విశాఖపట్నంలోని హోటల్‌ నోవాటెల్‌లో జరుగుతుందని ఉప కులపతి ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశరావు తెలిపారు. సోమవారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ముఖ్యఅతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారన్నారు. గౌరవ అతిథులుగా సుప్రీం కోర్టు నాయమూర్తులు జస్టిస్‌ పి.నరసింహ, జస్టిస్‌ జేకే మహేశ్వరి (డీఎస్‌ఎన్‌ఎల్‌యూ మాజీ చాన్సలర్‌), ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీఎస్‌ఎన్‌ఎల్‌యూ చాన్సలర్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ హాజరవుతారన్నారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన అకడమిక్‌ బ్లాక్‌-2, ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, ఇతర కొత్త భవనాలను ప్రారంభిస్తారని, జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహాలను ఆవిష్కరిస్తారనిఇ చెప్పారు. మీడియా సమావేశంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విశ్వచంద్రనాథ్‌ మాదాసు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 12:26 AM