సీఎం దృష్టికి లేటరైట్ తవ్వకాలు
ABN , Publish Date - May 03 , 2025 | 11:57 PM
గూడెంకొత్తవీధి మండలంలోని లేటరైట్ తవ్వకాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శనివారం అమరావతిలో లేటరైట్ తవ్వకాలపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం.. గిరిజన సంక్షేమశాఖా మంత్రికి ఫిర్యాదు చేశారు. లేటరైట్ తవ్వకాల వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుందని, మిరియాలు, కాఫీ, వరి, పసుపు, అల్లం పంటలు దెబ్బతింటాయని, భూగర్భజలాలు అంతరించిపోతాయని మంత్రికి వివరించారు.
- ఆదివాసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి
చింతపల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి): గూడెంకొత్తవీధి మండలంలోని లేటరైట్ తవ్వకాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. శనివారం అమరావతిలో లేటరైట్ తవ్వకాలపై పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం.. గిరిజన సంక్షేమశాఖా మంత్రికి ఫిర్యాదు చేశారు. లేటరైట్ తవ్వకాల వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుందని, మిరియాలు, కాఫీ, వరి, పసుపు, అల్లం పంటలు దెబ్బతింటాయని, భూగర్భజలాలు అంతరించిపోతాయని మంత్రికి వివరించారు. లేటరైట్ తవ్వకాలపై గిరిజనులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ మేరకు మంత్రి వెంటనే స్పందించి కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని, లేటరైట్ తవ్వకాల అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతానన్నారు. లేటరైట్ తవ్వకాలపై విచారణ చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.
డోకులూరు లేటరైట్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
గూడెంకొత్తవీధి: మండలంలోని పెదవలస పంచాయతీ డోకులూరు గ్రామంలో నిర్వహించాల్సిన లేటరైట్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా పడింది. డోకులూరు గ్రామంలో లేటరైట్ తవ్వకాల కోసం కిల్లంకోట గ్రామానికి చెందిన గిరిజనుడు బుక్కా రాజేంద్ర ప్రసాద్ గతంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు గనులశాఖ తవ్వకాల అనుమతులు మంజూరుచేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కోరింది. శనివారం కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ గ్రామసభ నిర్వహిస్తారని రెవెన్యూ అధికారులు దండోరా వేయించారు. ఈ మేరకు లేటరైట్ తవ్వకాలకు భూములు లీజుకిచ్చిన చాపరాతిపాలెం, డోకులూరు గిరిజన రైతులు, పెదవలస గ్రామ సర్పంచ్, పేసా కమిటీ సభ్యులు, వివిధ సంఘాల నాయకులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు గ్రామ సభ ప్రంగణానికి హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టర్ వస్తారని అధికారులు, రైతులు ఎదురుచూశారు. అయితే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ జీవో నంబరు-3 సాధన కోసం బంద్ నిర్వహిస్తున్న వివిధ సంఘాల నాయకులతో సమావేశమయ్యారని, గ్రామసభను వాయిదా వేయాలని కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నామని, తదుపరి తేదీని స్థానిక గిరిజనులకు ముందుగా తెలియజేస్తామని రెవెన్యూ అధికారులు ప్రకటించారు. కాగా ప్రజాభిప్రాయ సేకరణకు భారీ పోలీసు బందోబస్తు కల్పించారు.