Share News

మళ్లీ లేట‘రైట్‌’

ABN , Publish Date - May 07 , 2025 | 12:31 AM

జిల్లాలోని నాతవరం మండలం భమిడికలొద్ది అటవీ ప్రాంతం నుంచి లేటరైట్‌ ఖనిజం అక్రమంగా తరలిపోతున్నది. మాఫియాకు కాసులు కురిపించే లేటరైట్‌ తవ్వకాల విషయంలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు నడిచిన బాటలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఒక ప్రధాన పార్టీ నేతలు నడుస్తున్నారు. లేటరైట్‌ ఖనిజాన్ని యథేచ్ఛగా తవ్వుకుంటూ, సిమెంట్‌ పరిశ్రమలకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత కుమారుడి కనుసన్నల్లో లేటరైట్‌ తవ్వకాలు జరగ్గా.. ఇప్పుడు కూటమిలోని ఒక పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడి కుమారుడు తెర వెనుక ఉండి వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో నియంత్రణ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి అయినా చూడడంలేదు.

మళ్లీ లేట‘రైట్‌’
నాతవరం మండలం భమిడికలొద్దిలో ఎక్స్‌కవేటర్లతో తవ్వుతున్న లేటరైట్‌ ఖనిజం

నాతవరం మండలం భమిడికలొద్దిలో ఖనిజం తవ్వకాలు

గిరిజనుడి పేరుతో లీజు, మైనింగ్‌ మాఫియా వ్యాపారం

అధికారంలో ఉన్న నేతలకు కాసులు కురిపిస్తున్న లేటరైట్‌

నాడు వైసీపీ ముఖ్యనేత కుమారుడి దందా

లక్షల టన్నుల ఖనిజం అక్రమంగా తరలింపు

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మారిన పెత్తనం

ముఖ్య నేత తనయుడి హవా..

పట్టించుకోని నియంత్రణ శాఖల అధికారులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని నాతవరం మండలం భమిడికలొద్ది అటవీ ప్రాంతం నుంచి లేటరైట్‌ ఖనిజం అక్రమంగా తరలిపోతున్నది. మాఫియాకు కాసులు కురిపించే లేటరైట్‌ తవ్వకాల విషయంలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు నడిచిన బాటలోనే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఒక ప్రధాన పార్టీ నేతలు నడుస్తున్నారు. లేటరైట్‌ ఖనిజాన్ని యథేచ్ఛగా తవ్వుకుంటూ, సిమెంట్‌ పరిశ్రమలకు రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత కుమారుడి కనుసన్నల్లో లేటరైట్‌ తవ్వకాలు జరగ్గా.. ఇప్పుడు కూటమిలోని ఒక పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడి కుమారుడు తెర వెనుక ఉండి వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో నియంత్రణ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి అయినా చూడడంలేదు.

నాతవరం మండలం సుందరకోట పంచాయతీ భమిడికలొద్ది అటవీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో లేటరైట్‌ నిక్షేపాలు వున్నాయి. ఈ ఖనిజాన్ని సిమెంట్‌ ఉత్పత్తిలో ముడి సరకుగా వినియోగిస్తారు. అయితే భమిడికలొద్ది ప్రాంతంలో ఐదో షెడ్యూల్‌లో వుండడంతో ఇక్కడ 1/70 చట్టం అమల్లో వుంది. అంటే ఈ ప్రాంతంలో గిరిజనులు మినహా మరెవరూ మైనింగ్‌ చేయడానికి వీల్లేదు. దీంతో గత ప్రభుత్వం జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడిని తెరపైకి తీసుకువచ్చింది. ఇతని పేరుతో దరఖాస్తు చేయించి, 296.34 ఎకరాల్లో లేటరైట్‌ తవ్వుకొనేందుకు 2041వ సంవత్సరం వరకు అనుమతి ఇచ్చింది. లక్ష్మణరావు పేరు మీద లీజు అనుమతులు వున్నప్పటికీ, ఖనిజం తవ్వకాలు, రవాణా, విక్రయం అంతా నాడు అధికారంలో వున్న వైసీపీ పెద్దలే నడిపారు. నాడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే సహాయంతో ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత కుమారుడు లేటరైట్‌ ఖనిజాన్ని అడ్డగోలుగా తవ్వి, సిమెంట్‌ తయారీ కంపెనీలకు తరలించారు. రిజర్వు అటవీ ప్రాంతంలో ఖనిజం తవ్వడమే కాకుండా, దీనిని రవాణా చేయడానికి అడవిలో నుంచి రోడ్డు వేశారు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహించి, జర్తా లక్ష్మణరావు లీజును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో లేటరైట్‌ తవ్వకాలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

ప్రభుత్వం మారినా ఆగని తవ్వకాలు

గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో లేటరైట్‌ మాఫియా ఆగడాలకు చెక్‌ పడుతుందని గిరిజనులు, ప్రజా సంఘాల నాయకులు భావించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో ఎటువంటి మార్పులేదు. గతంలో వైసీపీ నాయకులు లేటరైట్‌ తవ్వకాలు చేపడుతున్నారంటూ అప్పట్లో ప్రతిపక్షంలో వున్న కొంతమంది కూటమి నాయకులు ఆందోళనలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అదే నాయకులు లేటరైట్‌ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. జిల్లాకు చెందిన ఒక ముఖ్యనేత కుమారుడు రంగంలోకి దిగి మళ్లీ జర్తా లక్ష్మణరావుకు చెందిన లీజు ఆధారంగా భమిడికలొద్దిలో లేటరైట్‌ తవ్వకాలు సాగిస్తున్నారు. గత రెండు వారాలుగా రేయింబవళ్లు ఎక్స్‌కవేటర్లతో ఖనిజాన్ని తవ్వి, టిప్పర్లతో తరలిస్తున్నారు. రోజూ 80 నుంచి 100 వరకు టిప్పర్లు, లారీల్లో లేటరైట్‌ను పక్కనే వున్న కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఏర్పాటు చేసిన యార్డుకు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి రావికంపాడు రైల్వే స్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి సిమెంట్‌ కంపెనీలకు పంపుతున్నారు.

ఇటీవల సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు నేతృత్వంలో సీపీఎం, స్థానిక గిరిజన సంఘాల నేతలు భమిడికలొద్ది లేటరైట్‌ మైనింగ్‌ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. గిరిజనుడైన జర్తా లక్ష్మణరావు పేరుతో లీజు పొందిన మైనింగ్‌ మాఫియా, గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా మైనింగ్‌ జరుపుతున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Updated Date - May 07 , 2025 | 12:31 AM