Share News

భద్రయ్యపేటలో భారీగా కిడ్నీ బాధితులు

ABN , Publish Date - Jul 22 , 2025 | 01:16 AM

మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధి నుంచి తమను కాపాడాలని పద్మనాభం మండలం భద్రయ్యపేటకు చెందిన పలువురు సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ను వేడుకున్నారు.

భద్రయ్యపేటలో భారీగా కిడ్నీ బాధితులు

  • గ్రామంలో 250 మంది నివాసం

  • సుమారు 50 మందికి వ్యాధి నిర్ధారణ!?

  • వైద్య సహాయం కోసం కలెక్టర్‌కు బాధితుల విన్నపం

మహారాణిపేట, జూలై 21 (ఆంధ్రజ్యోతి):

మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధి నుంచి తమను కాపాడాలని పద్మనాభం మండలం భద్రయ్యపేటకు చెందిన పలువురు సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ను వేడుకున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...భద్రయ్యపేటలో సుమారు 250 మంది నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా కొందరికి కాళ్లు, ముఖం వాచాయి. వైద్య పరీక్షలలో వారికి మూత్రపిండాల వ్యాధి (కిడ్నీ)గా నిర్ధారణ అయ్యింది. దీంతో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. ఆ లక్షణాలు ఉన్న సుమారు 160 మందికి పరీక్షలు నిర్వహించగా 50 మంది వ్యాధి బారినపడినట్టు తేలింది. తదుపరి చికిత్స కోసం కేజీహెచ్‌కు వెళ్లాలని వైద్యులు సూచించారు. బాధితుల్లో స్ర్తీ, పురుషులు ఉన్నారు. కేజీహెచ్‌లోని నెఫ్రాలజీ విబాగానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం ఆ నివేదికలతో కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చి తమ ఆరోగ్య పరిస్థితిని వివరించి, వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఇంతమందికి వ్యాధి రావడానికి గల కారణాలేమిటన్నది పరిశీలన చేయించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

Updated Date - Jul 22 , 2025 | 01:16 AM