విరుచుకుపడిన కొండచరియలు
ABN , Publish Date - Oct 30 , 2025 | 11:43 PM
మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.
మొంథా తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల ఘాట్ రోడ్డులో విరిగిపడిన వైనం
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టిన యంత్రాంగం
రాకపోకలకు మార్గం సుగమం
పాడేరు. అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. పాడేరు ఘాట్ మార్గంలో గురువారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు ధ్వంసమైంది. అలాగే కృష్ణాదేవిపేట- చింతపల్లి జాతీయ రహదారి రంపుల ఘాట్ రోడ్డులో కొండచరియలు, బండరాళ్లు విరిగిపడ్డాయి. అనంతగిరి మండలంలోని డముకు- నిమ్మలపాడు రోడ్డులోని గొర్రెగుమ్మి గ్రామ సమీపంలో గురువారం ఉదయం కొండచరియలు, మట్టి జారిపడడంతో రోడ్డు మూసుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టడంతో కొద్ది గంటల్లోనే సమస్య పరిష్కారమైంది.
పాడేరు ఘాట్ మార్గం సుమారు 25 కిలోమీటర్లుండగా, దానిలో కేవలం పది కిలోమీటర్ల పరిధిలోనే చెట్లు కూలడం, కొండచరియలు విరిగిపడడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా అమ్మవారి పాదాలు ప్రాంతం నుంచి వంట్లమామిడి గ్రామం వరకు ఉన్న సుమారు పది కిలోమీటర్ల ఘాట్ మార్గంలోనే ఈ ప్రతికూల పరిస్థితులున్నాయి. గత నాలుగేళ్లుగా ఘాట్‌లో వ్యూపాయింట్, రాజాపురం సమీప ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే వ్యూపాయింట్‌కు సమీపంలో ఉన్న రెండు మలుపులు వద్ద భారీ వర్షం కురిస్తే, వరద నీరు నిల్వ ఉండడంతోపాటు అక్కడి కొండ నుంచి కిందికి మట్టి వచ్చి పడుతుంది. దీంతో ఆ సమయంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనాల డ్రైవర్లు అంటున్నారు. ఘాట్‌లో రాజాపురం సమీపంలోనే ఈ సమస్య అధికంగా రాజాపురం గ్రామానికి అటు, ఇటు సుమారుగా కిలో మీటరున్నర దూరంలో ఉన్న పెద్ద కొండ ప్రాంతం నుంచి మట్టి పెళ్లలు విరిగిపడి రోడ్డుపైకి వస్తుంటాయి. దీంతో భారీ వర్షం కురిస్తే ఆ ప్రాంతానికి వచ్చేసరికి డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉంటారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే క్రమంలో రాజాపురం దాటిన తరువాత ఉన్న కాఫీ తోటల నుంచి వర్షానికి మట్టి రోడ్డుపైకి కొట్టుకు వస్తుంది. ఘాట్‌లో కేవలం పది కిలోమీటర్ల పరిధిలోని ఈ సమస్య ఉంది. కాగా గురువారం తెల్లవారుజామున పాడేరు ఘాట్ రోడ్డులో వ్యూపాయింట్‌కు సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు ధ్వంసమైంది. అలాగే వ్యూపాయింట్‌కు సమీపంలో విరిగిపడిన కొండచరియల వలన అక్కడ రోడ్డు ధ్వంసం కాగా, అందులోని కొన్నిరాళ్లు కిందన ఉన్న మరో మలుపు వరకు దొర్లాయి. దీంతో అక్కడున్న చెట్లు కూలిపోయి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. అయితే రాత్రుళ్లు ఘాట్ మార్గంలో రాకపోకలు నిలిపివేయడంతో ఎటువంటి నష్టం జరగలేదు.
రంపుల ఘాట్ రోడ్డులో..
గూడెంకొత్తవీధి: కృష్ణాదేవిపేట- చింతపల్లి జాతీయ రహదారి రంపుల ఘాట్ రోడ్డులో కొండచరియలు, బండరాళ్లు పడుతున్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రాజమహేంద్రవరం నుంచి రంపుల ఘాట్, చింతపల్లి, పాడేరు, అరకులోయ మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి 516-ఈ నిర్మాణం జరుగుతోంది. రంపుల ఘాట్‌లో కొండలను తొలిచి రహదారిని నిర్మించారు. కొన్ని చోట్ల రక్షణ గోడ ఓ మాదిరి ఎత్తు వరకు నిర్మించారు. ఘాట్‌లో 80శాతం రహదారిని ఆనుకుని ఉన్న కొండ వద్ద ఎటువంటి రక్షణగోడ లేదు. మొంథా తుఫాన్ ప్రభావం వలన కురుస్తున్న వర్షాలకు కొండచరియలు, బండరాళ్లు రహదారిపై పడుతున్నాయి. గురువారం తెల్లవారుజామున రంపులఘాట్ రోడ్డులో పలు చోట్ల కొండచరియలు రహదారిపై పడ్డాయి.
అనంతగిరిలో..
అనంతగిరి: మండలంలోని డముకు- నిమ్మలపాడు రోడ్డులోని గొర్రెగుమ్మి గ్రామ సమీపంలో గురువారం ఉదయం కొండచరియలు, మట్టి జారిపడడంతో రోడ్డు మూసుకుపోయింది. అనంతగిరి ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు వెంటనే స్పందించి ఎక్స్‌కవేటర్‌తో వాటిని తొలగించారు. దీంతో రాకపోకలకు మార్గం సుగమమైంది.
తుఫాన్ నష్టంపై ప్రాథమిక అంచనా
మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఏర్పడిన నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గురువారం నాటికి 554 పెంకుటిళ్లు దెబ్బతిన్నట్టు గుర్తించారు. 150 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. 56 పశువులు మృతి చెందాయని గుర్తించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో 40 చెట్లు, 90 వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రోడ్లు, భవనాల శాఖకు చెందిన సుమారుగా 126 కిలో మీటర్ల పరిధిలో రోడ్లు ధ్వంసమయ్యాయని, వాటి నష్టం విలువ రూ.958 లక్షలు ఉంటుందని గుర్తించారు. 19 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 891 మందిని తరలించి అవసరమైన సదుపాయాలు కల్పించారు. తుఫాన్ బాధితులకు ఉచిత రేషన్‌తో పాటు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రూ.కోటి 20 లక్షలు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేశారు.