ఎకువపాడు వద్ద జారిపడిన కొండచరియలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:01 PM
మండలంలోని లుంగుపర్తి కరకవలస రోడ్డులో ఎకువపాడు గ్రామం వద్ద శుక్రవారం రాత్రి రింగ్ రోడ్డుపై కొండచరియలు జారిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రెండు వారాల్లో అదే ప్రదేశంలో మూడోసారి
తొలగించని పంచాయతీరాజ్ అధికారులు
సర్పంచ్ సొంత నిధులతో తొలగింపు
అధికారులపై మండిపడుతున్న గిరిజనులు
అనంతగిరి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లుంగుపర్తి కరకవలస రోడ్డులో ఎకువపాడు గ్రామం వద్ద శుక్రవారం రాత్రి రింగ్ రోడ్డుపై కొండచరియలు జారిపడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల రోజుల్లో మూడు పర్యాయాలు అదే చోట మట్టి దిబ్బలు, కొండచరియలు జారి పడ్డాయి. అయినా పంచాయతీరాజ్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో సర్పంచ్ సొంత నిధులతో మట్టి దిబ్బలు, కొండచరియలను తొలగించారు.
మండలంలోని లంగుపర్తి నుంచి కరకవలస వరకు 10.5 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఉంది. ఈ రోడ్డును రెండేళ్ల క్రితం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రూ.7 కోట్లతో నిర్మించారు. లంగుపర్తి నుంచి ఎకువపాడు, దిగువపట్టి, ఎకువపట్టి, చీడివలస, దింశలవలస, కుంభర్తి, రాళ్లవలస, కరకవలస గ్రామాలను కలుపుకుంటూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే లంగుపర్తి-ఎకువపాడు సమీపంలోని ఇదే నెలలోని రెండుసార్లు మట్టిదిబ్బలు జారిపడగా.. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు జారి పడ్డాయి. దీంతో స్థానిక సర్పంచ్ జన్ని సన్యాసిరావు ఘటన స్థలానికి చేరుకుని కొండ చరియలను పరిసర గ్రామాల గిరిజనులతో తొలగించారు. మూడుసార్లు కొండచరియలు జారిపడినా కనీసం అధికారులు స్పందించలేదు. కోట్లాది రూపాయలతో రోడ్డు నిర్మించినా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కొండవాలు ఆనుకుని వర్షం నీరు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో కొండచరియలు విరిగి పడుతున్నాయని గిరిజనులు అంటున్నారు. అధికారులు కనీసం స్పందించకపోవడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.