చింతాలమ్మ ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:28 PM
జాతీయ రహదారి 516-ఈ మార్గంలో గల చింతాలమ్మ ఘాట్ రోడ్డులో రెండవ మలుపు వద్ద సోమవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి.
రెండు గంటల పాటు నిలిచిన ట్రాఫిక్
కొయ్యూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 516-ఈ మార్గంలో గల చింతాలమ్మ ఘాట్ రోడ్డులో రెండవ మలుపు వద్ద సోమవారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి. సమయానికి అటుగా వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నర్సీపట్నం నుంచి కొయ్యూరు, ఏలేశ్వరం, రాజమహేంద్రవరం వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న చింతాలమ్మ ఘాట్‌లో రెండవ మలుపు దాటగానే ఉన్న ప్రాంతంలో సోమవారం ఉదయం 7 గంటల సమయంలో కొండచరియలు విరిగిపడి మట్టితో పాటు బండరాళ్లు రోడ్డుకు అడ్డుగా పడ్డాయి. జాతీయ రహదారి నిర్మాణాల్లో భాగంగా సుమారు 40 అడుగుల మేర కొండను దొలిచి నిర్మాణాలు చేపట్టడంతో ఆ ప్రదేశంలోనే కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సుమారు రెండు గంటల పాటు ఘాట్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలిసి కొయ్యూరు ఎస్‌ఐ కిషోర్‌వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారి నిర్మాణ పనులు నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌సీ కంపెనీ సిబ్బందితో మాట్లాడి రోడ్డుపై పడిన మట్టి, రాళ్లు తొలగించే పనులు చేయించారు. అనంతరం వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.