Share News

అంబుజాకు అడ్డగోలుగా భూములు

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:08 AM

అంబుజా సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాజువాక నియోజకవర్గం మొత్తం ఏకమవుతోంది.

అంబుజాకు అడ్డగోలుగా భూములు

  • గంగవరం పోర్టు కోసం కేటాయించిన ల్యాండ్స్‌ను దుర్వినియోగం చేస్తున్న ‘అదానీ’

  • ఇది ముమ్మాటికీ నిబంధనలకు విరుద్ధం

  • ‘ఆరెంజ్‌’ పరిశ్రమ అంటూ అబద్ధం

  • కణితి గెడ్డ పక్కనే సిమెంట్‌ పరిశ్రమ

  • జీవ వైవిధ్యం దెబ్బతింటుందని ప్రజా శాస్త్రవేత్తల బృందం ఆందోళన

  • వ్యతిరేకిస్తున్న ప్రజా సంఘాలు, స్థానికులు, నాయకులు

  • నేడు నడుపూరులో ప్రజాభిప్రాయ సేకరణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అంబుజా సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గాజువాక నియోజకవర్గం మొత్తం ఏకమవుతోంది. నడుపూరులో బుధవారం జరిగే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు ప్రజా సంఘాలు, కాలనీ వాసులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. దీంతో వేదిక వద్ద శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఏర్పడింది.

గంగవరంలో పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో భూములు కేటాయించింది. వాటిని పోర్టు అవసరాలకు మాత్రమే వినియోగించాలి. సబ్‌ లీజులకు ఇవ్వడానికి, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండడంతో అదానీ యాజమాన్యం తాను అనుకున్నది చేయాలని మొండిగా ముందుకు వెళుతోంది. పెదగంట్యాడలో కణితి గెడ్డను ఆనుకొని సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. గంగవరం పోర్టు కాలుష్యానికి సిమెంట్‌ పరిశ్రమ కాలుష్యం కూడా తోడైతే పెదగంట్యాడ, గాజువాకల్లో అనేక ప్రాంతాల ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది. ఆ విషయం తెలిసి అక్కడి వారంతా ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారు. అసలు ప్రజాభిప్రాయ సేకరణే వద్దని డిమాండ్‌ చేస్తున్నారు. స్థానికులు, వామపక్షాల సంఘాలు దీనిపై గత నెల రోజులుగా పోరాటం చేస్తుండగా ఇప్పుడు వారికి కూటమి పార్టీ నాయకులు కూడా జత కలిశారు. చాలామంది కార్పొరేటర్లు కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ప్రత్యేకంగా లేఖలు రాసి, సిమెంట్‌ పరిశ్రమ వద్దని డిమాండ్‌ చేస్తున్నారు.

గంజాయి వనంలో తులసిమొక్క అంటూ...

అదానీ యాజమాన్యం అంబుజా సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటుపై అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. తాము పెట్టబోయే పరిశ్రమ ‘బి’ కేటగిరీకి చెందినదని, ఆరెంజ్‌ విభాగంలోకి వస్తుందని, దాంతో కాలుష్యం ఉండదని పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో పేర్కొంది. ఇది శుద్ధ అబద్ధమని ప్రజా శాస్త్రవేత్తల బృందం మంగళవారం తమ లేఖలో కుండబద్ధలు కొట్టింది. విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు, గంగవరం పోర్టు, హెచ్‌పీసీఎల్‌, కోరమండల్‌ వంటి రెడ్‌ కేటగిరీ పరిశ్రమలన్నీ అక్కడే ఉన్నాయని, వాటి మధ్యలో పెట్టే ‘అంబుజా సిమెంట్‌’ పరిశ్రమ ‘బి’ కేటగిరీలోకి రాదని, ఆరెంజ్‌ విభాగానికి ఎలా చెందుతుందని ప్రశ్నించారు. గంజాయి వనంలో ఉంటూ తులసి మొక్క అంటే ఎలా అని నిలదీశారు. దీనివల్ల తీర ప్రాంత జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, ఈ విషయాన్ని పర్యావరణ ప్రభావ అంచనా నివేదికలో తొక్కి పెట్టారని ఆరోపించింది.

ట్రాఫిక్‌ అంశాలే లేవు

అదానీ సమర్పించిన నివేదికలో సిమెంట్‌ పరిశ్రమ వల్ల ఏర్పడే ట్రాఫిక్‌ గురించి అసలు ప్రస్తావనే లేదని, ఇది చాలా కీలకమని శాస్త్రవేత్త బాబూరావు అన్నారు. ఉత్పత్తి చేసిన సిమెంట్‌ మొత్తం నౌకల ద్వారా రవాణా చేయరని, తయారీకి అవసరమైన ముడి పదార్థాల కోసం, సిమెంట్‌ ఉత్పత్తిని ఇతర ప్రాంతాలకు పంపడానికి రోజుకు కనీసం 500 భారీ వాహనాలు ఆ మార్గంలో ప్రయాణం చేస్తాయని పేర్కొన్నారు. ఆ రద్దీని తట్టుకొనే రహదారులు, వ్యవస్థ ఏమీ లేవని, దాంతో వాటిని నివేదికలో పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. లారీల పార్కింగ్‌, వీల్‌ వాషింగ్‌, టార్పాలిన్‌ కప్పి సరకు రవాణా వంటి అంశాలపై ప్రణాళికే లేదన్నారు. భారీ వాహనాల రాకపోకల వల్ల పెదగంట్యాడ-గాజువాక మార్గంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

ఇవేమీ లేవు

పర్యావరణ ప్రభావ అంచనా నివేదిలో లాజిస్టిక్‌ ప్లాన్‌, ట్రాఫిక్‌ ప్రభావం, రవాణా కాలుష్యం, రైలు, షిప్‌ నెట్‌వర్క్‌, కన్వేయర్‌ విధానం, రహదారుల పక్కన కాలుష్యం కొలిచే పరిరకాల వంటి అంశాలు ఏవీ ప్రస్తావించలేదని, నామమాత్రంగా తప్పుడు నివేదిక సమర్పించారని, దీనిని అధికారులు పరిగణనలోకి తీసుకోకూడదని ప్రజాశాస్త్రవేత్తల బృందం డిమాండ్‌ చేసింది.

అంబుజాకు అనుమతి నిరాకరించాలి

కలెక్టర్‌కు డిప్యూటీ మేయర్‌ దల్లి గోవిందరాజు వినతిపత్రం

గాజువాక, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పెదగంట్యాడ సమీపంలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతి నిరాకరించాలని జిల్లా కలెక్టర్‌కు మంగళవారం నగర డిప్యూటీ మేయర్‌ దల్లి గోవిందరాజు వినతిపత్రం అందజేశారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల వల్ల ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ తరుణంలో సిమెంట్‌ ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వొద్దని కోరారు. అటువంటి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని పేర్కొన్నారు.

సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకం

గంధం శ్రీనివాసరావు, 76వ వార్డు కార్పొరేటర్‌

అదానీ నిర్మించదలసిన అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఇప్పటికే పెదగంట్యాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల వల్ల తీవ్ర కాలుష్యం వస్తుంది. దీనికి తోడు ఇప్పుడు సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటైతే ఇంకా ఇబ్బందులు వస్తాయి. ఈ ఫ్యాక్టరీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.

Updated Date - Oct 08 , 2025 | 01:08 AM