నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుకు భూముల బదలాయింపు
ABN , Publish Date - Jul 10 , 2025 | 12:58 AM
జిల్లాలో నక్కపల్లిలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్కుకు భూ కేటాయింపు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27వ ఇ-కేబినెట్ సమావేశంలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు భూముల కేటాయింపుల అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
- ప్రభుత్వ ఆమోదం
అనకాపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నక్కపల్లిలో ఏర్పాటు కానున్న బల్క్ డ్రగ్ పార్కుకు భూ కేటాయింపు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27వ ఇ-కేబినెట్ సమావేశంలో జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు భూముల కేటాయింపుల అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు అవసరాలకు ఏపీఐఐసీ ద్వారా భూములను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు గతంలో ప్రతిపాదించిన విధంగా మొత్తం 2001.80 ఎకరాల భూములను ఇండస్ట్రీయల్ పార్కు కారిడార్‌కు బదిలీ చేయనున్నారు. ఇదే క్రమంలో నక్కపల్లిలో ఏర్పాటు కానున్న ఆర్సెల్లార్, నిప్పన్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించిన భూముల్లో 790 ఎకరాలకు కంపెనీ నగదు చెల్లించేలా అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. నక్కపల్లి సెజ్‌లో పరిశ్రమలకు కేటాయించిన స్థలంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, ప్లాంట్ డిజైన్ తదితర అంశాలపై కేంద్ర రీజనల్ ఫైనాన్స్ మినిస్ట్రీస్‌కు ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.