ఎంఎస్‌ఎంఈ పార్కుకు భూమి సిద్ధం
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:25 PM
మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం కోసం ఏపీఐఐసీకి సంబంధించిన 300 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు.
రామన్నపాలెంలో 300 ఎకరాల్లో నిర్మాణానికి సన్నాహాలు
మాకవరపాలెం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణం కోసం ఏపీఐఐసీకి సంబంధించిన 300 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. ఇటీవల పరిశ్రమల ముఖ్య కార్యదర్శి యువరాజ్ ఈ భూములను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. రాచపల్లి రెవెన్యూ రామన్నపాలెం గ్రామం వద్ద 2008లో సుమారు 300 ఎకరాల భూమిని ఏపీఐఐసీ అధికారులు తీసుకున్నారు. అయితే ఈ భూమి ఇప్పటి వరకు రైతుల సాగులోనే ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మించాలని నిర్ణయించడంతో ఈ భూమిని రైతుల నుంచి రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా గత నెల రోజులుగా ఈ భూమిలో ఉన్న వ్యవసాయ పంటలతో పాటు చెట్లను తొలగించారు. నవంబరు నెలలో ఇక్కడ ఎంఎస్‌ఎంఈ పార్కు నిర్మాణ పనులకు శంకుస్థ్ధాపన చేస్తారని ప్రచారం జరుగుతోంది. పార్కు నిర్మాణం కోసం భూమి పనులు పూర్తి చేసినట్టు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.