మరోసారి భూ సమీకరణ
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:09 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో మరోసారి ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు జిల్లాల్లో 1,941.19 ఎకరాలు సమీకరించాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో ‘ఫ్యూచర్ సిటీ’ కోసం వీటిని వినియోగిస్తారు. పేదలు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఉపయోగిస్తారు.
విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్
1,941.19 ఎకరాలు లక్ష్యం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వీఎంఆర్‌డీఏకు అప్పగించాలని ఆదేశం
అసైన్డ్ పట్టా ఉంటే ఎకరానికి 900 గజాలు
ఆక్రమణదారుడైతేఎకరానికి 450 గజాలు
అభివృద్ధి చేసిన భూమి ఇవ్వాలని నిర్ణయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)లో మరోసారి ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు జిల్లాల్లో 1,941.19 ఎకరాలు సమీకరించాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో ‘ఫ్యూచర్ సిటీ’ కోసం వీటిని వినియోగిస్తారు. పేదలు, బలహీన వర్గాల గృహ నిర్మాణానికి ఉపయోగిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం అటు అమరావతి, ఇటు విశాఖపట్నంలలో ల్యాండ్ పూలింగ్‌పై దృష్టిపెట్టింది. పేదలకు గతంలో ఇచ్చిన అసైన్డ్ భూములను, ప్రభుత్వ భూములను ఆక్రమించి రైతులు సాగు చేసుకుంటున్న భూములను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. భవిష్యత్తులో భూముల అవసరం చాలా ఉన్నందున ముందుగానే వాటిని సమీకరించి పెట్టుకోవాలని అనుకుంటోంది. దీనిపై కలెక్టర్లతో ముందుగానే చర్చించడంతో ఆయా జిల్లాల్లో సమీకరించడానికి అనువైన భూములను గుర్తించి సమాచారం అందించారు. ఆ ప్రకారం వీఎంఆర్‌డీఏకు వాటిని అప్పగించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆర్‌డీఓలు భూ సమీకరణ చేయాలని సూచించింది. అసైన్డ్ పట్టా ఉన్న రైతులకు ఎకరాకు 900 గజాలు, ఆ భూమిలో పదేళ్లకు పైగా ఆక్రమణలో ఉంటే 450 గజాలు అభివృద్ధి చేసిన భూమి ఇస్తారు. ల్యాండ్ పూలింగ్ కోసం 2016లో చేసిన చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది.
- విశాఖపట్నం జిల్లాలో 1,132.09 ఎకరాలు
ఆనందపురం మండలం గిడిజాల సర్వే నంబరు 258లో 309.18 ఎకరాలు
గోరింట సర్వే నంబరు 108లో 198.31 ఎకరాలు
శొంఠ్యాం సర్వే నంబరు 347/పిలో 251.55 ఎకరాలు
బీడీ పాలెం సర్వే నంబరు 1 లో 122.53 ఎకరాలు
పద్మనాభం మండలం కొవ్వాడ సర్వే నంబరు 237లో 250.52 ఎకరాలు
- విజయనగరం జిల్లాలో 25.41 ఎకరాలు.
డెంకాడలో సర్వే నంబర్లు 241, 242, 243లలో 20.41 ఎకరాలు.
భోగాపురం మండలం రావాడ సర్వే నంబరు 64/1లో 5 ఎకరాలు.
- అనకాపల్లి జిల్లాలో 783.69 ఎకరాలు
సబ్బవరం మండలం అంతకాపల్లిలో 175.42 ఎకరాలు
బాటజంగాలపాలెంలో 141.01 ఎకరాలు
ఎ.సిరసపల్లిలో 371.75 ఎకరాలు
నాళ్ల రేగుడిపాలెంలో 27.37 ఎకరాలు
పైడివాడ అగ్రహారంలో 28.14 ఎకరాలు
అనకాపల్లి మండలం తగరంపూడిలో 40 ఎకరాలు