ఐటీ సంస్థలకు భూములు
ABN , Publish Date - Dec 12 , 2025 | 01:21 AM
విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఐటీ కంపెనీలకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.
శ్రీ తమ్మిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు 81 సెంట్లు
ఏసీఎన్ హెల్త్‌కేర్ ఆర్‌సీఎం సర్వీసెస్ సంస్థకు 1.07 ఎకరాలు
నాన్‌రెల్ టెక్నాలజీస్‌కు ఎకరా
పర్యాటక రంగంలోను పెట్టుబడులు
ఎండాడలో పీవీఆర్ హాస్పటాలిటీ
రూ.225.3 కోట్ల పెట్టుబడి
మంత్రి వర్గంలో కీలక నిర్ణయాలు
విశాఖపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఐటీ కంపెనీలకు భూములు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం భూములు ఇస్తామని హామీ ఇవ్వగా, కేటాయింపునకు ముందే వాటి నిర్మాణ పనులకు ఐటీ సంస్థలు ఏర్పాట్లు చేసుకోవడం విశేషం. శ్రీ తమ్మిన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు రుషికొండ ఐటీ పార్క్ హిల్-2పై 81 సెంట్లు కేటాయించారు. ఎకరా రూ.12.4 కోట్లు ఉండగా, రూ.4 కోట్లకు కేటాయించి రూ.6.8 కోట్ల రాయితీ ఇచ్చారు. సంస్థ రూ.62 కోట్ల పెట్టుబడి పెట్టి 500 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. బీపీఎం, ఏఐ, క్యుఏ, ఫార్మా, బీమా, బ్యాంకింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో సేవలు అందిస్తుంది. ఈ ప్రాజెక్టును 12 నెలల్లో పూర్తి చేయాలని నిబంధన పెట్టారు.
- ఏసీఎన్ హెల్త్‌కేర్ ఆర్‌సీఎం సర్వీసెస్ సంస్థకు రుషికొండ ఐటీ పార్క్ హిల్-2పై 1.07 ఎకరాలు కేటాయించారు. రూ.30 కోట్ల పెట్టుబడితో 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. వీరికి భూమి విలువలో రూ.9.9 కోట్లు రాయితీ ఇచ్చారు. ప్రాజెక్టును 12 నెలల్లో ప్రారంభించాలి. హెల్త్ కేర్ రంగంలో పనిచేస్తుంది.
- నాన్‌రెల్ టెక్నాలజీస్‌కు హిల్-2పై నాన్ సెజ్ ఏరియాలో ఎకరా భూమి ఇచ్చారు. రాయితీ రూ.8.4 కోట్లు లభించింది. ప్రాజెక్టును ఏడాదిలో ప్రారంభించాలి. ఏఐ, బ్యాంకింగ్ రంగాల్లో సేవలు అందిస్తుంది. ఈ మూడు ఐటీ సంస్థలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు.
పర్యాటక రంగంలో...
- పర్యాటక రంగం అభివృద్ధి కోసం ఎండాడలో పీవీఆర్ హాస్పటాలిటీ సంస్థ 3 ఎకరాలు లీజుపై కేటాయించారు. అందులో రూ.225.3 కోట్ల పెట్టుబడి పెట్టి నేరుగా 230 మందికి, పరోక్షంగా వేయి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఆ భూమిలో 100 గదులతో హయత్ 5 స్టార్ హోటల్, మైస్ సెంటర్, హాస్పటాలిటీ మేనేజ్‌మెంట్ సంస్థ ఏర్పాటుచేస్తుంది. 66 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. మరో 33 ఏళ్లు పెంచుకోవచ్చు. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాలి.
- మెగ్‌లాన్ లీజర్స్ సంస్థకు మధురవాడలో 5 ఎకరాలు లీజుకు కేటాయించారు. అందులో రూ.348.12 కోట్ల పెట్టుబడితో 700 మందికి నేరుగా, వేయి మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో 250 గదులతో హిల్టన్ 5 స్టార్ హోటల్ నిర్మిస్తారు. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తిచేయాలి.