Share News

పరిశ్రమల కోసం ల్యాండ్‌ బ్యాంకు

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:14 AM

జిల్లాలో ఐటీ, ఐటీయేతర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను సిద్ధం చేసుకోవాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

పరిశ్రమల కోసం ల్యాండ్‌ బ్యాంకు

  • రెండు నుంచి మూడు వేల ఎకరాలు

  • సిద్ధం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయం

  • ఆనందపురం, పద్మనాభం మండలాలపై దృష్టి

  • ప్రభుత్వ భూముల వివరాల సేకరణ

  • ఐటీ, ఐటీయేతర పరిశ్రమలకు కేటాయింపు కోసమే...

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఐటీ, ఐటీయేతర పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను సిద్ధం చేసుకోవాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. తొలుత రెండు నుంచి మూడు వేల ఎకరాలను గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ప్రభుత్వ భూములను పారిశ్రామిక అవసరాలకు కేటాయించాలని భావిస్తోంది.

జిల్లాలో గాజువాక, పెదగంట్యాడ, పెందుర్తి మండలాల్లో కొంతమేర ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ...ఐటీ, ఇతర మౌలిక వసతుల కల్పన సంస్థలు అటు వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. నగరానికి ఉత్తరాన ఎక్కువగా అభివృద్ధి జరుగుతున్నందున పరిశ్రమలు కూడా ఆనందపురం, పద్మనాభం వైపు మొగ్గుచూపుతున్నాయి. విశాఖ రూరల్‌, భీమిలి మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో చాలావరకూ ఇప్పటికే ఐటీ కంపెనీలకు కేటాయించారు. భీమిలి మండలం కాపులుప్పాడలో సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో కొండలను గతంలో ఒక సంస్థకు కేటాయించారు. ఆ సంస్థ కొంత మొత్తం ప్రభుత్వానికి చెల్లించింది. అయితే అక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వం రద్దు నోటీస్‌ ఇవ్వగా...సంస్థ కోర్టుకు వెళ్లింది. ఈ వ్యాజ్యంపై ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఆ భూములు అందుబాటులోకి వచ్చి అనేక కంపెనీలకు కేటాయించవచ్చు. ఇందుకు సమయం పడుతుంది. అందువల్ల జిల్లా యంత్రాంగం ఆనందపురం, పద్మనాభం మండలాలపై దృష్టిపెట్టింది. ఆనందపురం మండలం జగన్నాథపురంలో గతంలో గ్రేహౌండ్స్‌కు సుమారు 350 ఎకరాలు కేటాయించారు. అయితే కొత్తవలస సమీపాన రెల్లి గ్రామంలో గిరిజన వర్సిటీకి గుర్తించిన భూముల్లో గ్రేహౌండ్స్‌ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో జగన్నాథపురంలో 350 ఎకరాలతోపాటు అక్కడే ఉన్న కొండ ప్రాంతాన్ని పరిశ్రమలకు కేటాయించేందుకు అవకాశం ఉంది. అలాగే గిడిజాల, రామవరం, భీమన్నదొరపాలెం, శొంఠ్యాం, కణమాం, తదితర పంచాయతీల్లో ప్రభుత్వానికి చెందిన భూములతో పాటు కొండల వివరాలను సేకరిస్తున్నారు. ఆ ప్రక్రియ ముగిసిన తరువాత ఇక్కడకు వచ్చే సంస్థలకు భూములు కేటాయించనున్నారు. ఇదిలావుండగా రాష్ట్ర ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ బుధవారం నగరానికి వచ్చి ఐటీ సంస్థలకు భూముల కేటాయింపుపై జిల్లా అధికారులతో చర్చించారు. కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనల మేరకు సాధ్యమైనంత వేగంగా భూములు కేటాయించాల్సి ఉంటుందన్న సూచన మేరకు అధికారులు ల్యాండ్‌ బ్యాంకు సిద్ధం చేస్తున్నారు.


మరో పరీక్షా కేంద్రానికి అనుమతి!

మారని ఏయూ దూర విద్య కేంద్రం అధికారులు తీరు

ఉన్న సెంటర్లు కుదించాలని

యోచిస్తున్న ఉన్నతాధికారులు

గుట్టుగా మరో కళాశాలకు గ్రీన్‌సిగ్నల్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

ఏయూ దూరవిద్య కేంద్రాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్న ఉన్నతాధికారుల లక్ష్యానికి విరుద్ధంగా కిందిస్థాయిలో కొందరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దూరవిద్య పరీక్ష కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగు తోందంటూ ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. కొన్ని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాలను, ప్రాక్టికల్‌ సెంటర్లను ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే ఏర్పాటుచేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇకపై కొత్తగా పరీక్షా కేంద్రాలను మంజూరు చేయ కూడదని, ఉన్నవాటినే కుదించాలని ఆలోచిస్తుంటే... కింది స్థాయి అధికారులు కొద్దిరోజుల కిందట గుట్టు చప్పుడు కాకుండా విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజక వర్గంలోని జామిలో ఒక కాలేజీకి పరీక్షా కేంద్రంగా అవకాశాన్ని కల్పించినట్టు తెలిసింది. సదరు కాలేజీలో కనీస స్థాయిలో మౌలిక వసతులు లేవని చెబుతున్నారు. పరీక్షా కేంద్రంతోపాటు అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. దీనివల్ల రానున్న రోజుల్లో అక్కడి నుంచి అడ్మిషన్లు జరిగే అవకాశం ఉందని, అదే జరిగితే మళ్లీ ప్రాక్టికల్‌ సెంటర్‌ కూడా మంజూరుచేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం లేక పోవడం గమనార్హం. ఇదిలావుంటే దూరవిద్య కోర్సుల ప్రవేశాలు నిర్వహించుకునేందుకు, పరీక్షా కేంద్రాల కోసం సుమారు 50కుపైగా దరఖాస్తులు ప్రస్తుతం అధికారు లకు వచ్చినట్టు తెలిసింది. వీరంతా వివిధ మార్గాల ద్వారా సెంటర్లుగా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అయితే, ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటివరకూ ఆయా కాలేజీలకు అవకాశం కల్పించలేదు. ఈ తరుణంలో కొత్తగా ఆ ఒక్క కాలేజీకి ఎలా అనుమతి ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై దూర విద్య కేంద్రం డైరెక్టర్‌ అప్పలనాయుడును వివరణ కోరగా... దీనిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.


స్మార్ట్‌ రైస్‌ కార్డులు 75 శాతం పంపిణీ

అగనంపూడికి రైతుబజార్‌ మంజూరు

ఆరిలోవలో బజార్‌ త్వరలో ప్రారంభం

ఎండాడ, పీఎం పాలెంలలో రైతుబజార్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తింపు

జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో గల బియ్యం కార్డుదారుల్లో 75 శాతం మందికి కొత్తగా ముద్రించిన స్మార్ట్‌ కార్డులు పంపిణీ చేసినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రేషన్‌ డిపోల వారీగా కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ఇప్పటివరకూ కార్డులు తీసుకోని వారంతా సమీపంలో గల రేషన్‌ డిపోలకు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. ఇంకా జ్ట్టిఞ://్ఛఞఛీట1.్చఞ.జౌఠి.జీుఽ,్ఛఞఛీటఅ్క/్ఛఞఛీట/ట్చ్టజీౌుఽఛ్చిటఛీ ట్ఛ్చటఛిజి.్ఛఞఛీట..కు వెళ్లి బియ్యం కార్డు వివరాలు నమోదుచేస్తే ఏ డిపోలో కార్డు ఉందో తెలుస్తుందన్నారు. సందేహాలుంటే జిల్లా పౌరసరఫరాల శాఖ లేదా సహాయ పౌర సరఫరాల శాఖ కార్యాలయాల్లో సంప్రతించాలన్నారు. అగనంపూడికి రైతుబజార్‌ మంజూరైందని, ఏర్పాటు కోసం 50 సెంట్ల ప్రభుత్వ స్థలం గుర్తించామన్నారు. ఆరిలోవలో ఇప్పటికే నిర్మించిన రైతుబజార్‌కు అప్రోచ్‌ రోడ్డు నిర్మించామన్నారు. త్వరలో వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. ఎండాడ, పీఎం పాలెంలలో రైతుబజార్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించామని, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే పనులు చేపడతామన్నారు. పెందుర్తి పరిసరాల్లో రైతుబజార్‌ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలం గుర్తించాలని అధికారులకు సూచించామని జేసీ తెలిపారు. ఇళ్లు పట్టాల కోసం అర్హులైన పేదలు సమీపంలో సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 01:14 AM