Share News

5 ఐటీ సంస్థలకు భూ కేటాయింపులు

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:45 AM

విశాఖను ఐటీ హబ్‌గా మార్చాలని పలు సంస్థలకు ఇక్కడ భూములు కేటాయిస్తూ వారం క్రితం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

5 ఐటీ సంస్థలకు భూ కేటాయింపులు

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • రుషికొండ, మధురవాడల్లో ఏఎన్‌ఎస్‌ఆర్‌కు 10.29 ఎకరాలు

  • రూ.1,000 కోట్ల పెట్టుబడి, పది వేల మందికి ఉద్యోగాలు

  • సిఫీ ఇన్ఫినిటీ స్పేస్‌కు రుషికొండ, పరదేశిపాలెంలలో 53.6 ఎకరాలు

  • పెట్టుబడి రూ.15,266 కోట్లు

  • బీవీఎం ఎనర్జీకి పనోరమ హిల్స్‌ వద్ద 30 ఎకరాలు

  • వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, స్టార్‌ హోటల్‌ నిర్మాణం

  • ఫీనమ్‌ పీపుల్స్‌కు 4.45 ఎకరాలు

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):

విశాఖను ఐటీ హబ్‌గా మార్చాలని పలు సంస్థలకు ఇక్కడ భూములు కేటాయిస్తూ వారం క్రితం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిపై శుక్రవారం ప్రత్యేకంగా జీఓలు జారీచేసింది. మొత్తం ఐదు సంస్థలకు భారీగా భూములు ఇచ్చింది. కొన్నింటికి మూడేళ్లలో ఆపరేషన్లు ప్రారంభించాలనే నిబంధన పెట్టింది. కొందరికి ఎకరా రూ.50 లక్షలకు, మరికొందరికి రూ.1.5 కోట్లకు, ఇంకొందరికి రూ.4.05 కోట్ల చొప్పున ధర నిర్ణయించింది. ఒక సంస్థకు ఎకరా 99 పైసలకే ఇవ్వడం గమనార్హం.

- ఏఎన్‌ఎస్‌ఆర్‌ గ్లోబల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థకు కేవలం 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చారు. రుషికొండ హిల్‌ నంబరు 3లో 2.5 ఎకరాలు, మధురవాడ హిల్‌ నంబరు 4లో 7.79 ఎకరాలు కేటాయించారు. వీరి పెట్టుబడి రూ.వేయి కోట్లు. పది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రధాన కార్యాలయం నిర్మించి మూడేళ్లలో ఆపరేషన్లు ప్రారంభించాలని నిబంధన పెట్టారు. ఇక్కడ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ వస్తుంది.

- సిఫీ ఇన్ఫినిటీ స్పేస్‌ లిమిటెడ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తుంది. వీరికి రుషికొండ హిల్‌ నంబరు 3లో 3.6 ఎకరాలు ఎకరా కోటి రూపాయలకు ఇచ్చారు. పరదేశిపాలెంలో 50 ఎకరాలు కేటాయించారు. వీరి పెట్టుబడి రూ.15,266 కోట్లు కాగా ఇచ్చే ఉద్యోగాలు 600. రెండేళ్లలో ఆపరేషన్లు ప్రారంభించాలి. పరదేశిపాలెం సర్వే నంబరు 134లో ముందుగా 25 ఎకరాలు ఎకరా రూ.50 లక్షలకు ఇచ్చారు.

- కపిల్‌ చిట్‌ఫండ్‌ గ్రూపునకు చెందిన బీవీఎం ఎనర్జీ అండ్‌ రెసిడెన్సీకి ఎండాడలో పనోరమ హిల్స్‌ వెనుక ఒకే దగ్గర ఏపీఐఐసీ ద్వారా 30 ఎకరాలు కేటాయించారు. అందులో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నిర్మిస్తారు. ఆఫీస్‌ స్పేస్‌, కో వర్కింగ్‌ స్పేస్‌, ఉద్యోగులకు నివాసాలు, స్టార్‌ హోటల్‌ వంటివి నిర్మిస్తారు. వీరి పెట్డుబడి రూ.1,250 కోట్లు కాగా 15 వేల మందికి ఉపాధి కల్పించాలి. ముందుగా సర్వే నంబరు 179/2లో పది ఎకరాలు ఇచ్చారు. ఎకరాకు రూ.1.5 కోట్లు ధర నిర్ణయించారు. వీరు 25 లక్షల చ.అ. విస్తీర్ణంలో నిర్మాణాలు చేపడతారు. కోట్లకే ఇచ్చారు.

- ఫీనమ్‌ పీపుల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఐటీ క్యాంపస్‌ నిర్మాణానికి ముందుకు రాగా 4.45 ఎకరాలు కేటాయించారు. రుషికొండ హిల్‌ నంబరు 2లోని నాన్‌ సెజ్‌ ఏరియాలో 45 సెంట్లు, మధురవాడ హిల్‌ నంబరు 4లో నాలుగు ఎకరాలు ఇచ్చారు. ఎకరాకు రూ.4.05 కోట్లు ధర నిర్ణయించారు. వీరి పెట్టుబడి 2078.5 కోట్లు కాగా దశల వారీగా ఐదేళ్లలో 2,500 మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఏడాదిలో క్యాంపస్‌ ఏర్పాటుచేసి, రెండేళ్లలో 1,250 మందికి ఉపాధి చూపించాలి.

సత్వ డెవలపర్స్‌కు 30 ఎకరాలు

సత్వ డెవలపర్స్‌కు ఐటీ స్పేస్‌, డేటా సెంటర్‌ ఏర్పాటు కోసం మధురవాడలోని హిల్‌ నంబరు 4లో 30 ఎకరాలు, ఎకరా రూ.1.5 కోట్లు చొప్పున ఇచ్చారు. వీరు రూ.1,500 కోట్ల పెట్టుబడితోనే 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లలో 10 లక్షల చ.అ. స్థలం, ఐదేళ్లలో 90 లక్షల చ.అ. నిర్మాణం పూర్తిచేయాలి.

Updated Date - Aug 02 , 2025 | 12:45 AM