ఢిల్లీలో సర్పంచ్ సంవాద్ సదస్సుకు లక్ష్మీ ప్రసన్న
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:48 AM
నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 15న ఢిల్లీలో జరగనున్న సదస్సుకు అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ సప్పారపు లక్ష్మీ ప్రసన్నకు ఆహ్వానం అందింది.
- కొత్తూరు సర్పంచ్‌కు అరుదైన అవకాశం
కొత్తూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 15న ఢిల్లీలో జరగనున్న సదస్సుకు అనకాపల్లి మండలం కొత్తూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ సప్పారపు లక్ష్మీ ప్రసన్నకు ఆహ్వానం అందింది. జలశక్తి మంత్రిత్వ శాఖలోని తాగునీరు, పారిశుధ్యం విభాగంలో క్వాలిటీ కౌన్సిల్ ఈ సదస్సు నిర్వహించనుంది. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి సుమారు 75 మంది సర్పంచులను ఎంపిక చేయగా, వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు సర్పంచులకు ఆహ్వానం అందింది. వారంతా ఆదివారం ఢిల్లీ బయలుదేరనున్నారు. సర్పంచ్ సంవాద్ యాప్‌లో దేశంలోని సర్పంచులు ఎప్పటికప్పుడు పంచాయతీలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చేశారు. రెండు లక్షల మంది సర్పంచులకు ఈ యాప్‌ను అనుసంధానం చేయాలని క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో 75 మంది సర్పంచులను జాతీయ స్థాయిలో గుర్తించి వారందరినీ ఆహ్వానించారు. వీరిలో కొత్తూరు సర్పంచ్ సప్పారపు లక్ష్మీ ప్రసన్న ఉన్నారు. ఈ సదస్సుకు కేంద్ర జల వనరుల శాఖా మంత్రి సి.ఆర్.పాటిల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గ్రామీణాభివృద్ధికి కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో, గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం సమస్యలు ఏ విధంగా అధిగమించాలో, తదితర విషయాలపై సదస్సులో అభిప్రాయాలు తెలియనున్నారు.
ఆనందంగా ఉంది
జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఈ విధంగా ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి దిశగా పంచాయతీని తీసుకువెళ్లేందుకు కృషి చేస్తాం. కొత్తూరు పంచాయతీ ప్రజల సహకారం వలనే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
- సప్పారపు లక్ష్మీప్రసన్న