విద్యార్థుల చేరికలో వెనుకబడి
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:49 PM
విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, బూట్లుతో పాటు తల్లికి వందనం పేరుతో ఏడాదికి ఒక విద్యార్థికి రూ.13 వేలు ఇస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగడం లేదు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య
గత వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాలే కారణం
కూటమి సర్కారు వచ్చినా మారని పరిస్థితి
మండలంలోని 12 స్కూళ్లలో పది మందిలోపే బాలలు
చోడవరం, జూలై 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం, బూట్లుతో పాటు తల్లికి వందనం పేరుతో ఏడాదికి ఒక విద్యార్థికి రూ.13 వేలు ఇస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం పాఠశాలల విలీనం పేరుతో రేపిన చిచ్చుతో కుదేలైన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి.. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయినా ఇంకా మారలేదు.
మండలంలోని 46 ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలకు గాను 12 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పదికి లోపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చాలా వరకు చక్కని వసతితో పాటు ఉపాధ్యాయులు కూడా అందుబాటులోనే ఉన్నారు. అయినప్పటికీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏమంత గొప్పగా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పరిశీలిస్తే, గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న బడుల విలీనం ప్రభావం ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై కనిపిస్తున్నదనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలను సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చాలా వరకు ప్రాథమిక పాఠశాలలకు ఊపిరిపోసే చర్యలు చేపట్టింది. గతంలో హైస్కూళ్లలో విలీనం చేసిన మూడు, నాలుగు, ఐదు తరగతులను తిరిగి వెనక్కి పంపించింది. ఒకటి, రెండు తరగతి చిన్నారుల కోసం కొత్తగా ఫౌండేషన్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేసింది. అలాగే హైస్కూళ్లలో కూడా ఒకటి నుంచి ఐదు వరకు తరగతులు ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం ఇంత చేసినా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మండలంలోని జి.జగన్నాథపురం, గవరవరం, లక్కవరం, కోమటివీధి, సింహాద్రిపురం, జుత్తాడ, చందకవీధి, దుడ్డుపాలెం, గోవాడ, ముద్దుర్తి, అంభేరుపురం పాఠశాలలు కేవలం పదిలోపు విద్యార్థులతోనే నడుస్తున్నాయి. మండలంలోని లక్కవరం స్కూల్‌లో ఇద్దరు, గవరవరంలో ఐదుగురు, సింహాద్రిపురంలో ముగ్గురు, దుడ్డుపాలెంలో నలుగురు ఉండగా, మిగిలిన చోట ఐదుగురు, ఎనిమిది మంది చొప్పున ఉన్నారు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు విద్యారంగంపై ఖర్చు పెడుతున్నా, తల్లిదండ్రులు మాత్రం దూరమైనా ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దే చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే తల్లికి వందనం పథకం అమలుచేస్తే తప్పా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు మునుపటి కళ రాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.